రుణాలు మంజూరు చేయాలి
అధికారులు సహకరించాలి
● వైఎస్పార్ కాలనీలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు
● రుణం కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
మండవల్లి: పేదల సొంతింటి కళ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు సొంతిల్లు సమకూర్చేందేకు వైఎస్సార్ కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం రుణం మంజూరు చేసింది. ఈ క్రమంలో చాలా చోట్ల పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే తరువాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలపై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు లేక, రుణం మంజూరు కాకపోవడంతో ఇళ్లు నిర్మించుకునే వీలు లేక లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. మండవల్లిలోని వైఎస్సార్ కాలనీలో 174 మందికి ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు గతంలో కేటాయించారు. 74 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని ఫౌండేషన్ దశలో, 30 ఇళ్లకు భీములు పోసి, మరో 10 ఇళ్లు శ్లాబ్ దశలో, 10 ఇళ్లు పూర్తికాబడి ఉన్నాయి. మిగిలిన వంద మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం మంజూరు కాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. రుణ సౌకర్యం కలిగిస్తేనే గృహాలు నిర్మించుకోగలమని చెబుతున్నారు.
మౌలిక వసతులు శూన్యం
కాలనీ పొలాల మధ్యలో ఉండడం.. ఇక్కడ ఎలాంటి తాగునీటి వసతి కల్పించకపోవడంతో కాలనీలోని లబ్ధిదారులు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలనీకి వెళ్లే రహదారి పల్లపు ప్రదేశంలో ఉండటంతో వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైఎస్సార్ కాలనీలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు, మిగిలిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
అస్తవ్యస్తంగా కాలనీ రహదారి
మండవల్లి వైఎస్సార్ కాలనీలో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి
సుమారు 100 ఇళ్లు రుణ సౌకర్యం లేక ఖాళీ స్థలాలతో ఉన్నాయి. లబ్ధిదారులంతా రెక్కాడితే గానీ డొక్క నిండని పేదవారు. ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తేనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. అధికారులు త్వరితగతిన వారికి రుణాలు మంజూరు చేయాలి.
– సుంకర కనకరాజు, మండవల్లి
కాలనీలో ఉన్నవారందరూ పేదలే. ప్రభుత్వం రుణం మంజూరు చేయకుండా ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం కష్టమే. స్థలాలు ఉన్నా ఇళ్ల నిర్మాణాలు జరుగకుంటే ప్రయోజనం లేదు. అధికారులు లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేసి సహకరించాలి.
– రాజేంద్ర, మండవల్లి


