ముదినేపల్లి (కై కలూరు): రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ముదినేపల్లి మండలం, శింగరాయపాలెం–చేవూరుపాలెంలో కొలువైన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం పోటెత్తారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ ప్రత్యేక అభిషేకాలు చేశారు. దేవస్థాన ఆవరణలో పుట్టిలో వెలిసిన స్వామివారికి అనేక మంది భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యంగా ఓ జంట యజ్ఞాన్ని నిర్వహించి నాగ ప్రతిష్ట చేశారు. ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్.గంగా శ్రీదేవి, ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని నిర్వహించారు.
కామవరపుకోట: స్థానిక రామన్నపాలెం రోడ్డులోని తపస్య ఎడ్యుకేషనల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఏలూరు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ పాలూరి, సెక్రటరీ కన్నా సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 9 చెస్ పోటీలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన బాలురు విభాగంలో శివనాగ్ 4 పాయింట్లు, అఖిలేష్ 3 పాయింట్లు, బాలికల విభాగంలో చిర్నవి 3 పాయింట్లు, బిస్మి యాస్మిన్ జారా 2 పాయింట్లు సాధించి ఎంపికయ్యారు. విద్యాసంస్థల యాజమాన్యం జగన్ పాల్గొన్నారు.
ముసునూరు: మండలంలోని చింతలవల్లిలో రూ.4.02 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి ఆదివారం గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి భూమి పూజ చేశారు. అనంతరం రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టరు టీవీఎన్‌ఎస్.మూర్తి, ఎస్‌ఈ యు.హనుమయ్య, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ ఇంట్లోకి ప్రేవేశించిన పామును స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ క్రాంతి చాకచక్యంగా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం గ్రాండ్–2 సాయి బాలాజీ టౌన్‌షిప్ 3వ రోడ్‌లో దినేష్‌పటేల్ మార్వాడి వ్యాపారి ఇంట్లోకి నాలుగు అడుగుల గోధుమ తాచుపాము ప్రవేశించింది. ఆదివారం ఉదయం నిద్రలేచి ఇంట్లో నుంచి బయటకు రాగానే గుమ్మం వద్ద గోధుమ తాచు పడుకుని ఉంది. భయభ్రాంతులకు గురైన దినేష్ పటేల్ వెంటనే స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన క్రాంతి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అటవీప్రాంతలో విడిచిపెట్టాడు.
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం మాత్రమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ.84,926 ఆదాయం వచ్చిందని తెలిపారు. అమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్పారు.


