తాడేపల్లిగూడెం: పట్టణంలో ఇద్దరు యువకులు రేషన్ దందా సాగిస్తున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో ఒకరు స్లీపింగ్, మరొకరు యాక్టివ్ పార్టనర్‌గా కొనసాగుతున్నారు. స్లీపింగ్ పార్టనర్‌గా చెప్పుకొనే వ్యక్తి గతంలో దొంగ బియ్యాన్ని కొనుగోలు చేసే మిల్లుల సమాచారం తెలుసుకొని ఇతరులకు ఉప్పు అందించి సొమ్ములు చేసుకొనేవాడని ప్రతీతి. ప్రస్తుతం అతడు అక్రమ బియ్యంలో ఉండడమే కాక, ఒక పెద్దతలకాయ పేరు చెప్పి ఉద్యోగుల బదిలీలు చక్కపెడుతున్నాడంటున్నారు. ఏడాదికి ముందు రేషన్ మాఫియా సవితృపేటకు చెందిన వారసత్వ బియ్యం అక్రమ రవాణా చేసే ఒక కుటుంబంలో ఉండేదనేది బహిరంగ రహస్యం. పెదతాడేపల్లి మార్గంలో ఎరువుల గోదాములు కేంద్రంగా అక్రమ బియ్యం నిల్వలు చేసి, జిల్లాను దాటించి సొమ్ములు చేసుకొనే వారు. విజిలెన్సు దాడులు జరిగినా కూడా అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట పడలేదు. చివరికి వ్యవహారం తలబొప్పి కట్టేలా తయారవుతున్న తరుణంలో ఈ అక్రమ వ్యవహారానికి బలవంతంగా బ్రేక్ వేశారు. అక్రమ రేషన్ వ్యవహారం తాత్కాలికంగా ఆగినట్టుగా కనిపించినా ఏడాదిగా మళ్లీ పురుడుపోసుకుంది. ఈ నూతన ద్వయం అక్రమ రేషన్ వ్యవహారం యథేచ్ఛగా సాగిస్తోంది. యాక్టివ్‌గా ఉన్న భాగస్వామి ఇటీవల అక్రమ బియ్యం తరలిస్తున్న తరుణంలో విజిలెన్స్ అధికారులు భీమడోలులో బియ్యం పట్టుకున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో, ఆరో వార్డులోని మామిడితోటలోనూ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అయినప్పటికీ అక్రమ రేషన్ వ్యాపారం మూడు మూటలు, ఆరు బస్తాలుగా సాగుతోందని తెలుస్తోంది. పెద్దతలకాయల పేరుచెప్పి స్లీపింగ్ పార్టనర్ పేట్రేగిపోతున్న వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రేషన్ మాఫియా సాగిస్తున్న నయా ద్వయం
విచ్చలవిడిగా అక్రమ బియ్యం వ్యాపారం
మా వెనుక పెద్దలున్నారంటూ బ్లాక్ మెయిలింగ్


