కొత్త సీట్లు.. ఆశావహుల్లో సందడి | - | Sakshi
Sakshi News home page

కొత్త సీట్లు.. ఆశావహుల్లో సందడి

Mar 25 2026 6:49 AM | Updated on Mar 25 2026 6:49 AM

సాక్షి ప్రతినిధి, ఏలూరు: మార్పులు, చేర్పులతో కొత్త నియోజకవర్గాల పునర్విభజనకు సర్వం సన్నద్ధమైంది. పార్లమెంట్‌ సమావేశాల్లో పునర్విభజన బిల్లును ఆమోదించి 2027 జనగణనకు అనుగుణంగా కొత్త నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఉమ్మడి పశ్చిమ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. జిల్లాలో 4 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లో హడావుడికి తెరలేచింది.

దాదాపు 5 స్థానాలు పెరిగే అవకాశం

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల రాజకీయ ముఖచిత్రం మారనుంది. నియోజకవర్గాల జనాభా, సీ్త్ర, పురుష ఓటర్లు, మండలాల విస్తీర్ణం అన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుని పునర్విభజన ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లును ఆమోదించి 2027 మార్చి జనగణనతో పాటే పునర్విభజన ప్రక్రియ కూడా ముగించనుంది. దీంతో రెండు జిల్లాలో కలిపి 4 నుంచి 5 స్థానాలు పెరిగే అవకాశం ఉందని అంచనా. కొత్తగా జిల్లా కేంద్రాలకు అనుబంధంగా రూరల్‌ నియోజకవర్గాలు, అలాగే విస్తీర్ణం దృష్ట్యా, ఓటింగ్‌ దృష్ట్యా 2.50 లక్షలకుపైగా ఓటింగ్‌ ఉన్న స్థానాల్లో మండలాల మార్పులు, చేర్పులతో కొత్తవి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ అంశం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌ మారింది. భవిష్యత్‌ రాజకీయాలకు అనుగుణంగా అధికార, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆశావహుల్లో హడావుడి ప్రారంభమైంది. మరోవైపు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఖరారైతే ఉమ్మడి జిల్లాలో మూడు స్ధానాలు మహిళలకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన దక్కే అవకాశం ఉంది.

రూరల్‌ నియోజకవర్గాల ఏర్పాటు?

ఏలూరు జిల్లాలో కొత్తగా రెండు లేదా 3 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏలూరు రూరల్‌ నియోజకవర్గం ఏర్పాటు చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో కొంత భాగంతో జంగారెడ్డిగూడెం నియోజకవర్గం ఏర్పాటవుతుందని అంటున్నారు. అదే విధంగా ద్వారకాతిరుమల కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏలూరు జిల్లాలోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలే పునర్విభజనపై రకరకాల ప్రచారాలు కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరిలోనూ ఇదే తరహాలో భీమవరం రూరల్‌తో పాటు పాలకొల్లు రూరల్‌, పాత అత్తిలిని కొత్తగా నియోజకవర్గం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు పునర్విభజనలో రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు అనివార్యంగా మారాయి. పోలవరం ఎస్టీ రిజర్వ్‌డ్‌ మినహా ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతాయని ఊహగానాలు తెరలేచాయి. మరోవైపు నర్సాపురం పార్లమెంట్‌లో ఒక్క ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గం కూడా లేదు. ఈ క్రమంలో నర్సాపురంలో ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఏర్పాటైతే రాజమండ్రిలో రిజర్వ్‌డ్‌ స్ధానాలు తగ్గే అవకాశం ఉంది. ఇక ఏలూరు జిల్లాలో రెండు జనరల్‌ స్థానాలు ఏర్పడే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో 88 స్థానాలు పెరగనున్న నేపధ్యంలో ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఐదుగురు ఆశాహహులకు అవకాశాలు దక్కనున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన షురూ

మారనున్న ఉమ్మడి పశ్చిమ రాజకీయ ముఖచిత్రం

ఆశావహుల్లో మొదలైన హడావుడి

ఉమ్మడి పశ్చిమలో 4 నుంచి 5 స్థానాలు పెరిగే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement