● హామీలు అమలు చేయకపోతే తాడోపేడో
● ఒక్కరోజు నిరాహార దీక్షతో రంగంలోకి
ఉండి: ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాల్సిందేనని, లేదంటే రణభేరి మోగించడం ఖాయం అంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అనుబంధ సంఘాల నాయకులు మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక చెప్పింది చేయకుండా మన పని అయిపోయిందని సంబరపడితే.. ఉద్యోగుల సత్తా చూపిస్తామని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఆ హామీలన్నీ ఏమయ్యాయి?
అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని, పీఆర్‌సీ అమలుకు కమిషన్ వేస్తామని చెప్పిన నేతలు రెండేళ్లవుతున్నా ఆ ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలంటూ ఎదురు ప్రశ్నించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని, దానిలో భాగంగానే రణభేరి మోగించామన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించి, అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామన్నారని, ఇప్పుడు సీపీఎస్ రద్దుపై కేవలం స్టడీ చేస్తున్నానంటూ సాగదీత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..
పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించడంతో పాటు 29 శాతం ఐఆర్ ప్రకటించి, పెండింగ్ డీఏలు విడుదల చేయాలి. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్‌మ్యాప్ ప్రకటించాలి. సీపీఎస్ రద్దు చేసి, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.


