మావుళ్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీలు | - | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీలు

Mar 25 2026 6:49 AM | Updated on Mar 25 2026 6:49 AM

మావుళ్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీలు నడిపూడి సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దు తణుకు టీబీ విభాగానికి అవార్డులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు నేటి నుంచి పొగాకు వేలం

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం పట్టణంలో వేంచేసిన మావుళ్లమ్మను ఎమ్మెల్సీలు ఐజాక్‌ బాషా, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.

పెనుగొండ: నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నడిపూడి సర్పంచ్‌ కడలి బేబీ అన్నపూర్ణ చెక్‌ పవర్‌ రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలంగా వార్డు సభ్యులు, గ్రామస్తుల ఫిర్యాదుతో పలుమార్లు విచారణ నిర్వహించారు. ఇద్దరు కార్యదర్శులు, గ్రామ సర్పంచ్‌పైనా నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై నోటీసులు జారీ చేసి, అనంతరం చెక్‌ పవర్‌ రద్దు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో టి.సూర్యనారాయణ మూర్తి తెలిపారు.

తణుకు అర్బన్‌: ప్రపంచ టీబీ డే సందర్భంగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో టీబీ విభాగ సిబ్బందికి అవార్డులు దక్కాయి. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీతాబాయ్‌, జిల్లా టీబీ ఆఫీసర్‌ డాక్టర్‌ రవిబాబు చేతులమీదుగా జిల్లా బెస్ట్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌గా పంజా రవిబాబు, బెస్ట్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పలివెల చినబాబు, బెస్ట్‌ ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌గా రాచమళ్ల వెంకటకృష్ణ అవార్డులు అందుకున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): తల్లిదండ్రులు, వృద్ధుల ఆదరణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను, వృద్ధులను గౌరవించి ఆదరించడం ద్వారా సమాజంలో మంచి వ్యక్తులుగా నిలవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఆశ పెట్టుకోకుండా స్వయంగా ఎదగాలని, ప్రేమ, వాత్సల్యంతో వారిని ఆదరించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ పి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, వృద్ధుల ఫిర్యాదులను స్వీకరించినప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖ అధికారులపై ఉందని, కలెక్టర్‌ ఆదేశించారు. పథకం పురోగతిపై కలెక్టర్‌ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్ష్యాలకు అనుగుణంగా సోలార్‌ ప్యానల్స్‌ అమరిక జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

జంగారెడ్డిగూడెం: నేటి నుంచి వర్జీనియా పొగాకు వేలం ప్రారంభం కానుంది. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ జె.సురేంద్రకుమార్‌ తెలిపారు. గత ఏడాది వేలం ప్రక్రియ రైతులు ఊహించిన దానికంటే రికార్డు స్థాయిని ధరను అందించింది. ఈ సారి పంట పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా కౌలు లీజులు పెరగడం, ఎరువులు, పురుగుమందులు తదితర ధరలు కూడా పెరగడంతో ఎక్కువ మొత్తంలో రైతులు వెచ్చించారు. కర్ణాటక మార్కెట్‌ అనుకూలంగా లేకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం, అనుమతించిన 49 మి.కిలోల కంటే అధికంగా పడించడంతో కొంత ఒత్తిడి ఉంది. మొత్తంగా 80 మి.కిలోల పైబడి ఉత్పత్తి రావ చ్చనే అంచనాలు నడుమ ధరపై కూడా రైతులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కేజీ అత్యధిక ధర రూ.456 లభించగా, సరాసరి ధర రూ. 297.50 లభించింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రారంభ ధర రూ.350 పైగా రావడంతో పాటు, రూ.320 నుంచి రూ.350 మధ్య వస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని వర్జీనియా రైతు సంఘ నాయకులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement