ఉపాధి పనుల్లో అవకతవకలు
● పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపులు
● ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో వెల్లడి
● రికవరీకి ఆదేశించిన అధికారులు
ముసునూరు: ప్రభుత్వ పథకాన్ని సవ్యంగా అమలు చేయకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించబోనని సోషల్ ఆడిట్, పబ్లిక్ హియరింగ్ ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 16 గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల 18 వ విడత సామాజిక తనిఖీలపై ప్రజావేదిక కార్యక్రమాన్ని స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ పి.ఏసుబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీల్లో పలు గ్రామాల క్షేత్ర సహాయకులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో నాణ్యతాలోపం, అవగాహన లేమి, బిల్లుల చెల్లింపుల్లో ఉన్న ఆరాటం, ఆత్రుత తదితర అంశాలు వెల్లడయ్యాయి. రహదారి వేయకుండానే.. 61 మీటర్ల రహదారి వేసినట్లు బిల్లుల చెల్లింపు, కూలీలు పనికి రాకపోయినా హాజరువేయడం, వేలి ముద్రలు వేయకున్నా వేతనాల చెల్లింపులు, మొక్కలు వేయకుండానే.. వేసినట్లు లెక్కలు చూపడం, తదితర తప్పులు బహిర్గతం అయ్యాయి. 2,467 పనులు నిర్వహించగా, వాటిపై జరిమానాలు రూ.44 వేలతో కలిపి మొత్తం రూ.51 వేలు రికవరీలకు జిల్లా విజిలెన్స్ అధికారిణి అనుపమ ఆదేశించారు. అనంతరం ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ సిబ్బంది సక్రమంగా పనిచేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో అవసరమైన సమగ్ర సౌకర్యాలు చేపట్టాలని, ఎక్కువ మందిని సమకూర్చాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొండా దుర్గాభవాని, వైస్ ఎంపీపీ రాజానాయన, ఏపీడీ శ్రీనివాస్, అంబుడ్స్‌మెన్ మహబూబ్ బాషా, మణికంఠ, స్టేట్ రిసోర్స్ పర్సన్స్, ఏపీఓ రోజ్‌లీల, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.


