ధర్మ పోరాటానికి సీఐటీయూ మద్దతు
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్ష మంగళవారం నాటికి 14వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా ఐ3 బిల్డింగ్ వద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాట దీక్ష నిర్వహించారు. ఈనెల 7న చాన్సలర్‌ను కలిసి చర్చలు జరపనున్న నేపధ్యంలో చర్చల అనంతరం చేపట్టాల్సిన కార్యాచరణను నిర్ణయిస్తామని వారు పేర్కొన్నారు. వీరి ధర్మ పోరాట దీక్షకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను, న్యాయమైన డిమాండ్‌లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నేటి నిత్యవసర ధరలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కారం అయితేనే విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు దృష్టి సారించగలరని నిజాన్ని పాలకులు గుర్తించాలన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాడ సీతాపతిరావు, పీవీ లక్ష్మణరావు, జడ సుబ్బారావు, రాజేష్ పాల్గొన్నారు.


