వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారికి నిర్వహించిన తిరువీధి సేవ భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజ గోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనం అయింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. ఆఖరిలో ఆలయ ప్రధాన కూడలిలో ఉన్న ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
పెదపాడు: కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పెదపాడు ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనం సీజ్‌చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు.


