వైఎస్సార్‌సీపీ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కక్ష గట్టి దాడులు చేస్తే సహించేది లేదని, మా కార్యకర్తలకు ఏమైనా జరిగితే దేనికై నా సిద్ధమని, ఎక్కడికై నా వెళ్లేందుకు వెనుకాడబోమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మండలం అంబర్‌పేట గ్రామంలో దళితులైన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కూరపాటి నాగభూషణంపై కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకునేలా వేధించడం దుర్మార్గమన్నారు. కూటమి నేతల భూదందాలు అధికారులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఏలూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాగభూషణాన్ని సోమవారం వాసుబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. పార్టీ అండగా ఉంటుందని నాగభూషణానికి భ రోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగభూషణం 40 ఏళ్ల క్రితం ముగ్గురు అన్నదమ్ముల వద్ద 60 సెంట్ల భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడిందన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కావటంతో స్థానిక టీడీపీ, జనసేన నేతలు టార్గెట్ చేశారని విమర్శించారు. అంబర్‌పేటలో ఏకంగా 100 ఎకరాల పోరంబోకు భూమి ఉందని, క్వారీలు కూటమి నేతలు, భూస్వాముల స్వాధీనంలో ఉన్నాయని, అధికారులు వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు చెందిన పెద్ద రైతులు పలు ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, అయితే దళితుడైన నాగభూషణం కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మాత్రమే ప్రభుత్వ అధికారులు అలజడులు సృష్టించటం, లాక్కునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని వాసుబాబు మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు


