బల ప్రదర్శనకు వేదికగా జాతర
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజలను భక్తిమార్గంలో నడిపిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా జరగాల్సిన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. జాతరలో రాజకీయాల ప్రవేశంతో వేరుకుంపట్లు పెట్టుకుని ఎవరికి వారుగా ఉత్సవాలను నిర్వహించే పరిస్థితికి ఉత్సవాన్ని దిగజార్చారు. గతంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర మహోత్సవాలను కొన్ని కమిటీల ప్రతినిధులు ఆదాయ వనరుగా పరిగణించి ప్రతి ఏడేళ్ళకు ఒకసారి నిర్వహించేలా సంప్రదాయాన్ని మార్చేశారు. అయినప్పటికీ అమ్మవారి జాతర నగర ప్రజల్లో సెంటిమెంట్‌గా నిలిచిపోవడంతో కమిటీల నిర్ణయానికి ప్రజలు అంగీకారం తెలిపి ఎప్పుడు అమ్మవారి జాతరకు పిలుపునిచ్చినా ఉత్సవాల విజయవంతానికి తమవంతు సహకారం అందిస్తున్నారు.
బల ప్రదర్శనకు వేదికగా గంగానమ్మ జాతర
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు జాతర జరుగుతుందని నగర ప్రజల్లో చర్చ నడుస్తోంది. గతంలో జాతర మహోత్సవాలన్నీ టీడీపీ అధికారంలో ఉండగా జరిగినవే కావడంతో ఈ చర్చకు బలం చేకూరుతోంది. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే జాతర మహోత్సవాలకు సంబంధించి కమిటీల్లో అందరూ టీడీపీకి చెందిన నాయకులే ఉండడంతో ఈ వాదన నిజమే అంటున్నారు. ప్రస్తుతం కొన్ని కమిటీలు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవడం కోసం అదే పార్టీకి చెందిన, అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరిని కమిటీలకు దూరం చేయడంతో అలా బయటకు వెళ్ళాల్సి వచ్చిన వారు తమ ప్రాంత వాసులతో చర్చించి వేరుకుంపటి పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. అలా వేరు కుంపటి పెట్టుకున్న వారు తమ బలాన్ని ప్రదర్శించే కార్యక్రమాలు చేపడుతున్నారని భక్తులు అంటున్నారు.
సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శన
వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరకు ఆయా కమిటీల ప్రతినిధులు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల విజయోత్సవ యాత్రలు, చిత్ర ప్రమోషన్ కోసం పర్యటన చేస్తూ నగరానికి విచ్చేసిన సినీ బృందాలను కొందరు కమిటీల వారు తమ మేడల వద్దకు రప్పిస్తున్నారు. మరి కొందరు రాజకీయ ప్రముఖులను, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ మేడల వద్దకు తీసుకొచ్చి అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. మరోప్రాంతంలో రోజూ ప్రత్యేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి తిప్పలు పడుతున్నారు.
బృందాలుగా సారెల సమర్పణ
నగరంలోని అమ్మవారి భక్తులు మాత్రం తమ భక్తిప్రపత్తులు చాటుకుంటూనే ఉన్నారు. ఏడేళ్ళ తరువాత వచ్చిన జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటున్నారు. అమ్మవార్లు వేంచేసిఉన్న మేడల వద్దకు తండోపతండాలుగా భక్తులు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చద్ది నైవేద్యాలు, చలిమిడి, వడపప్పు, పానకం సమర్పిస్తున్నారు. నగరంలోని వివిధ పేటలకు చెందిన భక్తులు, ఒక్కో అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్న భక్తులు సామూహికంగా అమ్మవార్లకు సారెలు సమర్పిస్తున్నారు.
కమిటీల్లో పోటీ వాతావరణం
గతంలో రెండు మూడు ప్రాంతాలకు పరిమితమైన జాతర ప్రస్తుతం ఏడు ప్రాంతాలకు విడిపోయింది. కేవలం పడమర వీధి, తూర్పువీధి, పవర్‌పేటల్లో మాత్రమే ఇలా 12 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతరను నిర్వహించేవారు. ఈ కమిటీల్లో ఇతరులకు స్థానం కల్పించడానికి ఆయా కమిటీల ప్రతినిధులు నిరాకరించడంతో మరి కొన్ని ప్రాంతాల వారు వీరికి పోటీగా జాతర కొలుపులు ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణపు వీధిలో జాతర మహోత్సవం పడమర వీధి కమిటీకి వ్యతిరేకంగా ప్రారంభమైనట్టు అనుకుంటున్నారు. లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, తంగెళ్ళమూడి ప్రాంతాల్లో కూడా జాతర నిర్వహిస్తున్నారు.
భక్తుల్లో గందరగోళం
పోటీ వాతావరణంలో జరుగుతున్న జాతర మహోత్సవాలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గంగానమ్మ జాతరలో భాగంగా స్థానిక పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారు నగరంలోని ఎక్కువ ప్రాంతాల్లో సంచరించే వారు. ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా పడమర వీధి మేడల వద్దకే వెళ్ళి మొక్కులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా తాము గతంలో కొలిచిన అమ్మవారి వద్దకు వెళ్ళాలా, లేకుంటే కొత్తగా తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మేడలవద్దకు వెళ్ళాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. అటూఇటూ తేల్చుకోలేని వారు మాత్రం ఎందుకై నా మంచిదని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేడలను సందర్శించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఏలూరులో సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శనలు
బృందాలుగా అమ్మవార్లకు సారెల సమర్పణ
కమిటీల్లో పోటీ వాతావరణం
బల ప్రదర్శనకు వేదికగా జాతర
బల ప్రదర్శనకు వేదికగా జాతర


