కనులపండువగా శ్రీవారికి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి, తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ఈ వేడుక ఆధ్యంతం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం పూజలు జరిపి హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
జంగారెడ్డిగూడెం: బంగారం తీసుకుని వస్తువులు తయారు చేస్తానని, పాత బంగారం రిపేర్ చేయిస్తానని చెప్పి ఏడుగురిని మోసం చేసిన తండ్రీకొడుకులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మున్సిబు గారి వీధిలో స్వర్ణకారులైన తండ్రీకొడుకులు పడగ రాము, విజయ్‌ప్రకాష్ బంగారు నగలు తీసుకుని మోసం చేసినట్లు తెలిపారు. నూకారపు చంద్ర అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వారిని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లిలో సోమవారం ఓ భారీ కొండచిలువ స్థానికుల చేతిలో హతమైంది. పోలవరం కుడి కాలువ పక్కనున్న శ్రీనివాస రెడ్డి, తన తోటలోకి వెళుతుండగా 13 అడుగుల ఈ కొండ చిలువ ఆయన కంటపడింది. దాంతో ఒక్కసారిగా ఆయన హడలిపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారిని పిలువగా, వారొచ్చి ఈ కొండ చిలువను హత మార్చారు. ఇంత పెద్ద కొండ చిలువను చూడడం ఇదే మొదటిసారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఇంకా కొండ చిలువలు ఉన్నాయని, పశువులపై దాడి చేస్తున్నాయని రైతులు అంటున్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలని గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కో–కన్వీనర్ వసంతాటి శ్రీనివాస్ సూచించారు.
కనులపండువగా శ్రీవారికి తిరువీధి సేవ


