కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి
పోలవరం రూరల్: కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సోమవారం పోలవరం మండలం వింజరం సచివాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడారు. 10శాతం నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటే కొత్త చట్టం ప్రకారం 40 శాతం నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులు కాలరాస్తూ ఉపాధి హామీ పనులు ఏ ప్రాంతంలో, ఎలా కల్పించాలో కేంద్రం నిర్ణయిస్తుందనడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు కొమరం రామారావు, మడి వెంకటగిరి, పాములేటి పెంటారెడ్డి, శబల శివకుమార్, అరగంటి జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను కొనసాగించాలి
జంగారెడ్డిగూడెం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు జీవరత్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ చట్టంపై గ్రామసభ నిర్వహించారు. సభ అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యదర్శి జె.సతీష్ కి అందించారు.
సామాన్యల జీవన హక్కులపై ప్రభావం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు గ్రామీణ పేదలు, కూలీలు, నిరుద్యోగ యువత జీవన హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డీవైఎఫ్‌ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ ఖండించారు. ఈ మార్పులను వెంటనే ఉపసంహరించుకొని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మైసన్నగూడెం సచివాలయం వద్ద కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం అందజేశారు.


