మందు వికటించి 19 గొర్రెలు మృతి
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం ఎ.గోకవరంలో జలగ మందు వికటించడంతో 19 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఆకుల గంగరాజు 50 గొర్రెలకు జలగ నివారణ మందును ఆదివారం పట్టించారు. ఆదివారం సాయంత్రానికి 12 గొర్రెలు చనిపోయాయి. సోమవారం మరో 7 గొర్రెలు చనిపోయాయి. విషయం పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియడంతో చేబ్రోలు, కై కరంలోని పశువైద్యులు అప్రమత్తమయ్యారు. గొర్రెలను చేబ్రోలు తెప్పించుకుని 30 గొర్రెలకు వైద్యం చేయించారు. ఆ గొర్రెలు తేరుకుంటున్నాయి. గొర్రెలు ఎందుకు చనిపోయాయో తెలుసుకోడానికి ఏలూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. సోమవారం సాయంత్రానికి నివేదిక రాగా.. ఎక్కువ మోతాదులో మందు వాడటం వల్ల గొర్రెలు చనిపోయినట్లు తేలిందని చేబ్రోలు పశువైధ్యాదికారి కిషోర్ వివరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చేబ్రోలు పశువులు ఆసుపత్రి వద్దకు వెళ్ళి బాధిత రైతులను పరామర్శించారు.


