స్వర్ణోత్సవ సంబరాలకు ఎస్వీకేపీ సిద్ధం
పెనుగొండ: మెరుగైన విద్యతో పేరెన్నికగన్న ఎస్వీకేపీ విద్యా సంస్థలు స్వర్ణత్సోవ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. పెనుగొండలో 1974లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం కళాశాలలో దేశ విదేశాల్లో స్థిరపడిన విద్యార్ధులు తరలిరానున్నారు. ఈ కళాశాలను డాక్టర్ కేఎస్ రాజు, 8 మంది సభ్యులతో ప్రారంభించారు. 1974లో కేవలం నాలుగు కోర్సులతో ప్రారంభమై, 1976లో జాతీయ సేవా పథకం, 1978లో క్రీడా విభాగం, 1984లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, 1987లో బీఎస్సీ కంప్యూటర్స్ ప్రారంభించారు. 1992లోనే ఎంసీఏ కోర్సు స్థాపించి, ఎందరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తయారుచేసింది. సంబరాలకు 5 వేలకు పైగా పూర్వ విద్యార్థులు హజరవుతున్నారని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు తెలిపారు.


