వెలివేశారంటూ ఆత్మహత్యాయత్నం
ముసునూరు: తన కుటుంబాన్ని వెలివేసినట్లు కుల పెద్దలు ప్రకటించడంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకారావు ఇటీవల నాటు సారా తయారీ, విక్రయాలు నిర్వహిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత గ్రామంలోని తన సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు అతనిని పంచాయతీకి పిలిపించి, రూ.లక్ష జరిమానా విధించారని, కట్టలేమని బతిమాలినా వినిపించుకోలేదని జరిమానా చెల్లించకపోతే వెలివేస్తున్నామని ప్రకటించారని వీడియోలో పేర్కొన్నారు. తమ కులస్తులు ఎవరూ తమతో మాట్లాడకుండా ఉండాలని, తన తల్లిదండ్రులను కూడా బెదిరించారని, తమకు మంత్రి పార్థసారథి అండదండలున్నాయని ఏమీ చేయలేవని తనను బెదిరించారని వీడియోలో పేర్కొన్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పురుగుమందు డబ్బాతో సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై చెప్పారు. సీసీ కెమేరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. సారా తయారీ విక్రయాలు మానేయాలని హెచ్చరించామని తమ మాటను ధిక్కరించడంతో మిన్నకుండి పోయామని, వెలి వేయడం, కుల బహిష్కరణ చేయడం వంటి నిర్ణయాలు తాము చేయలేదని కుల పెద్దలు పేర్కొంటున్నారు.
పురుగుల మందు డబ్బాతో కుటుంబం సెల్ఫీ వీడియో


