బతుకు చక్రం సాగేదెలా?
ప్రభుత్వం ఆదుకోవాలి
గతం ప్రభుత్వం ఆర్థిక భరోసానిచ్చింది
బుట్టాయగూడెం: సమాజంలో మనిషికి గౌరవం, హుందాతనం వచ్చేలా చేసేది అతను ధరించే దుస్తులే. ఆ దుస్తులకు మంచి రూపురేఖలతో సాధారణ గుడ్డను దుస్తులుగా తయారు చేయడంలో టైలరింగ్‌దే కీలకపాత్ర. అయితే టైలర్ బతుకు చక్రం అంధకారంగా మారింది. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో కుట్టు మిషన్ల చక్రం వేగం తగ్గింది. వివిధ డిజైన్‌లతో రెడీమేడ్ దుస్తులు సరసమైన ధరలకే లభించడంతో యువత వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీని ఫలితంగా టైలర్ల కుటుంబ పోషణ భారమై దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు రెడీమేడ్ దుస్తులపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో టైలర్స్ చేతుల్లో పనిలేక అనేక మంది రోడ్డున పడుతున్నారు. కొందరైతే ఈ పనిమానేసి వేరే పనుల్లో స్థిరపడుతున్నారు. 30 ఏళ్లపాటు టైలరింగ్ వృత్తిలో అనుభవం ఉన్న టైలర్‌లు ప్రస్తుతం చేసేందుకు పనిలేక ఇల్లు గడవక బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకుని సరుకులను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
జిల్లాలో 600కు పైగా టైలర్లు
జిల్లాలో సుమారు 600కు పైగా టైలర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అత్యధికంగా 30 నుంచి 40 సంవత్సరాలు అనుభవం ఉన్న టైలర్లు ఉన్నారు. ఒకప్పుడు ఎలాంటి దుస్తులు కుట్టాలన్నా టైలర్లపైనే ఆధారపడవలసి వచ్చేది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పాఠశాలల పునఃప్రారంభం సమయాల్లో టైలర్లకు తీరికలేక రాత్రీ పగలు పనిచేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనుచూపుమేర కనిపించడంలేదని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల ప్రభావం గుదిబండలా మారింది. క్రిస్మస్, సంక్రాంతి పండుల్లో కుట్టేందుకు తమకు పనులు లేక మహిళల చీరల పాలు, పాత ప్యాంట్‌లు సైజులు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నామని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 600 మంది టైలర్ల పరిస్థితి ఇలానే ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో
రూ.10 వేల ఆర్థిక భరోసా:
వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదికి రూ.10 వేల చొప్పున టైలర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా టైలర్స్ డే రోజున టైలర్ల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇలా ఒక్కో టైలర్‌కు నాలుగేళ్లలో రూ.40 వేలు సొమ్ము బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. ప్రస్తుతం పనులు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారంలేక తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని టైలర్‌లు కోరుతున్నారు.
టైలర్లకు తగ్గిన గిరాకీ
పండుగ రోజుల్లో పనులు లేక
వెలవెలబోతున్న షాపులు
ప్రత్యామ్నాయ పనుల వైపు చూపు
వైఎస్సార్‌సీపీ పాలనలో ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం
టైలర్ వృత్తినే నమ్ముకుని జీవనం సాగించే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. మార్కెట్‌లోకి రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో పనులు లేక టైలర్‌లు దుర్భర జీవితం గడుపుతున్నారు. రాబోయే రోజుల్లో టైలర్‌లు కనుమయ్యే పరిస్థితి నెలకొంది. నేను 1982 నుంచి టైలర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం టైలర్‌లకు ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు. ప్రభుత్వం టైలర్లను ఆదుకోవాలి. దొండపాటి గంగులు, టైలర్, బుట్టాయగూడెం
ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం టైలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పండుగ రోజుల్లో కూడా పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. నేను గత 30 సంవత్సరాలుగా టైలరింగ్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఇద్దరు టైలర్‌లు పనిచేస్తున్నారు. వారికి పని చూపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. పండుగ రోజుల్లో సరైన పనులు లేక ముగ్గురం ఖాళీగా ఉంటున్నాము. గత వైఎస్సార్‌సీపీ పాలనలో మా బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రూ. 10వేలు చొప్పున నాలుగేళ్లలో రూ. 40 వేలు అందించారు. షేక్ లాల్‌సాహెబ్, బాబూ టైలర్, బుట్టాయగూడెం
బతుకు చక్రం సాగేదెలా?
బతుకు చక్రం సాగేదెలా?
బతుకు చక్రం సాగేదెలా?


