ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి
దెందులూరు: విద్యుదాఘాతంతో గోపన్నపాలెంలో ఆకుల సురేష్‌కు చెందిన ఇంట్లో ఫ్రిడ్జ్, సామగ్రి అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆకుల సురేష్ ఇంట్లో మంటలు ఎక్కువ కాకుండా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఫ్రిజ్‌తో పాటు రూ.లక్ష విలువచేసే సామగ్రి కాలిపోయింది.
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని 21వ వార్డు కొబ్బరితోట, మహంకాళమ్మ గుడి సమీపంలో ఉంటున్న నడపన రంగారావు(50) శనివారం సాయంత్రం టూ టౌన్‌లోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. రంగారావు టీ సెంటర్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు.
పెనుగొండ: అప్పుల బాధతో చిట్‌ఫండ్ వ్యాపారి దొంగరావిపాలెం బ్రిడ్జి వద్ద శనివారం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేట మండలం ఏడిదకు చెందిన పల్లా సురేష్(52) చిట్‌ఫండ్ చేస్తూ నష్టాల పాలయ్యాడు. భార్య నాగలక్ష్మీకి చెందిన బంగారం అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య నాగలక్ష్మి తణుకులో జాన్వీ బ్యూటీ అకాడమీలో బ్యూటిషియన్‌గా పనిచేస్తోంది. అప్పులు బాధ ఎక్కువ కావడంతో ఏడిదలో ఉన్న ఇంటిని అమ్మే విషయంలో మనస్పర్ధలు రావడంతో తణుకు నుంచి ఏడిద వెళ్తూ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కొయ్యలగూడెం: సామాజిక తత్వవేత్తలు, సంస్కర్తలు, సాహితీవేత్తల గురించి భావితరాలు తెలుసుకునేలా సమష్టి కృషి అవసరమని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రచయిత డాక్టర్ ఊటుకూరి వరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన రచించిన శ్రీభిన్న స్వరాల్ఙు పుస్తక ఆవిష్కరణ శనివారం జరిగింది. పుస్తక పఠనం సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో చదివే వారి సంఖ్య కనుమరుగవుతుందని అన్నారు. తన స్వీయ ఖర్చులతో ముద్రించిన పుస్తకాలను తాను పనిచేసిన పాఠశాలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
భీమడోలు: భీమడోలులో శనివారం ఏలూరుకు చెందిన జూడాల వంశీ మోహన్ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మోహన్ విధి నిర్వహణలో భాగంగా భీమడోలులో చిట్స్ కార్యాలయం వద్ద బైక్‌కు తాళం వేసి వెళ్లాడు. విధులను ముగించుకుని వచ్చేసరికి బైక్ కనిపించలేదు. బాధితుడు భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెదపాడు: మండలంలోని అప్పనవీడులో గత నెల 23న రెడ్డి జ్యోతి అనుమానస్పద మృతిపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా భర్త అనిల్, మరో మహిళ పాకలపాటి జ్యోతిని అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చామని ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు.
పోలవరం రూరల్: పోలవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు శనివారం 5వ రోజు కూడా కొనసాగాయి. హామీలు ఇచ్చిన నాయకులు, హామీలు విస్మరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పునరాలోచన చేసి జిల్లా కేంద్రంగా చేయాలని సాధన సమితి కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి
ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి
ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి


