కబడ్డీ పోటీలు ప్రారంభం
వీరవాసరం: వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసులు శనివారం ప్రారంభించారు. 23 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, మానసిక ఉత్తేజం కలుగుతాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గభవాని, వీరవల్లి చంద్రశేఖర్, అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, బాజీంకి గంగా మహేష్ , కరీంశెట్టి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి భక్తులు అందించే కానుకలకు దేవస్థానం తరపున రసీదు అందిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి సీహెచ్ సాయి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 29 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు తెలిపారు. 26న రథోత్సవం నిర్వహించునున్నట్లు తెలిపారు. అన్నదానానికి భక్తులు అందించే విరాళాలకు ఎలాంటి రసీదులు ఇవ్వమని కొంతమంది అంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి అపోహలు నమ్మవద్దని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అన్నదానానికి భక్తులు అందించిన విరాళాలు రూ.6,24899 దేవస్థానం తరఫున ఉన్న బ్యాంక్ అకౌంట్‌లోనే జమ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తామని తెలిపారు.
తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతిచెందగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం స్థానిక శర్మిష్ట సెంటర్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో తణుకు టి.వేమవరానికి చెందిన కేతా బాలు(19) ఘటనా ప్రాంతంలోనే మృతిచెందగా కోటిపల్లి మహేష్, గుత్తుల జగదీష్ తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుతో పాటు స్నేహితులు మహేష్, జగదీష్ తణుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురూ కింద పడిపోగా బాలు బస్సు ముందు చక్రం కిందికి వెళ్లిపోయాడు. కొంత దూరం బస్సు ఈడ్చుకువెళ్లినట్లుగా చెబుతున్నారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
కబడ్డీ పోటీలు ప్రారంభం


