కార్మికుల శక్తి విశాఖ సభలో చూపిస్తాం
తణుకు అర్బన్: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పాలకులకు కార్మికుల శక్తి విశాఖపట్నంలో నిర్వహించే కార్మిక బహిరంగ సభలో చూపిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్ అన్నారు. శనివారం స్థానిక రాష్ట్రపతి రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇస్తే కొనుగోలు శక్తి పెరుగుతుందని అన్నారు. సంపద కొంతమంది వద్ద పోగుపడడం వల్ల వ్యాపారాలు ముందుకు సాగడం లేదని అన్నారు. కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చినా ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోతే సంక్షోభాలు తప్పవన్నారు. కార్మికుల శ్రమ నుంచే సంపద వస్తుందని అటువంటి కార్మికులకు పనికి తగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అడగర్ల అజయ కుమారి, ఎన్.ఆదినారాయణ బాబు, ఏ.కృష్ణబాబు, పి.జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు.


