న్యాయ అవగాహన సదస్సు
భీమవరం: ప్రతిభకు వైకల్యం అడ్డుకాకూడదనే సంకల్పంతో బ్రెయిలీ అంధులకు లిపి కనిపెట్టాడని, అంధుల్లో కూడా ఉన్నత స్ధాయికి చేరుకున్నవారు ఉన్నారని 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి అన్నారు. జనవరి 4న బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా శనివారం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జువ్వలపాలెం రోడ్డులోని యూవీఎస్‌ఎం కంటి ఆసుపత్రి నిర్వహిస్తున్న దృష్టి వైకల్య కేంద్రంలో న్యాయ అవగాహనా సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా మండల న్యాయ సేవా సంస్థను సంప్రదించాలన్నారు. దృష్టి వైకల్య కేంద్ర నిర్వాహకులు డాక్టర్ యూవీ రమణరాజు కేంద్రంలో అంధ విద్యార్ధులకు అందిస్తున్న సేవల గురించి న్యాయమూర్తికి వివరించారు. న్యాయమూర్తి విద్యార్ధులను పేరు అడిగి భవిష్యత్తులో ఏమవ్వాలని కోరుకుంటున్నావని అడిగి తెలుసుకున్నారు.


