జాడ లేని డూడూ బసవన్నలు
అడుక్కునే వారిలా చూస్తున్నారు
● కష్టతరంగా గంగిరెద్దు కుటుంబాల జీవనం
● కనుమరుగవుతున్న సంక్రాంతి సందడి
చింతలపూడి : తెలుగువారి సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక గంగిరెద్దులాట. సంక్రాంతి వస్తుందంటే చాలు.. రంగు రంగుల బట్టలు, గంటలు, మువ్వలతో అలంకరించిన బసవన్నలు ఇంటింటికీ తిరిగి అలరించేవి. కాలక్రమేణా శ్రీడూడూ బసవన్నశ్రీ గొంతులు మూగబోతున్నాయి. ఆదరణ కరువై, పొట్టకూటి కోసం గంగిరెద్దులను ఆడించే వారు వేరే పనులు చూసుకుంటున్నారు.
పూర్వకాలం నుండి ఈ కళనే నమ్ముకున్నారు. ఎడ్లను తమ కన్న బిడ్డల్లా సాకుతూ, వాటికి విద్యలు నేర్పి, ఊరూరా తిరుగుతూ తెలుగు లోగిళ్లలో పండుగ వెలుగులు నింపుతారు. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం పెరగడం, వినోద సాధనాలు మారడంతో ఈ కళ తన ప్రాభవాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు ఊరు మొత్తం ఎదురుచూసే ఈ ప్రదర్శనను ఇప్పుడు గడప దాటి పలకరించే నాథుడే కరువయ్యాడు.
సంక్రాంతి రోజుల్లోనే..
గంగిరెడ్ల వారికి ఏడాది పొడవునా పనేమీ ఉండదు. కేవలం సంక్రాంతి పండుగ (ధనుర్మాసం) ప్రారంభంలో పండుగ వచ్చే నెల రోజుల ముందే వీరికి కాస్తో కూస్తో ఆదరణ లభిస్తుంది. పండుగ సమయంలో గ్రామస్తులు ఇచ్చే పాత బట్టలు, ధాన్యం, చిల్లర డబ్బులే వీరికి ప్రధాన ఆదాయ వనరు. బసవన్నలను అలంకరించడానికి, వాటి మేత కోసం చేసే ఖర్చులతో పోలిస్తే వచ్చే ఆదాయం నామమాత్రమే.. అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరగడం వల్ల నగరాల్లో గంగిరెద్దుల రాక దాదాపు నిలిచిపోయింది.
వృత్తిని వదిలేయలేక, పొట్ట నింపుకోలేక గంగిరెద్దుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఊరూరా తిరిగే సంచార జీవనం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. వీరి తాత, ముత్తాతలు, తండ్రులు పడుతున్న కష్టాలు చూడలేక తర్వాతి తరం కూలి పనులకు వెళ్తోంది. వీరికి స్థిర నివాసం లేకపోవడం వల్ల రేషన్ కార్డులు, ఓటరు కార్డులు వంటి ప్రభుత్వ ఫలాలు అందడం గగనంగా మారుతోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సుమారు 250 కుటుంబాలకు పైగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు ఊరురా గౌరవం పొందిన ఈ కళాకారులు, నేడు సరైన ఆదరణ లేక ఇతర పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రాభవం తగ్గడానికి కారణాలు
యాంత్రీకరణ వల్ల వ్యవసాయంలో ఎద్దుల వినియోగం తగ్గిపోయింది. వినోద సాధనాలు, టీవీలు, స్మార్ట్‌ఫోన్ల రాకతో జానపద కళలపై ఆసక్తి తగ్గింది. ఆర్థిక ఇబ్బందులు, ఎద్దుల పోషణ ఖరీదుగా మారింది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు
సంస్కృతిని కాపాడుకుందాం
గంగిరెద్దులాట కేవలం ప్రదర్శన కాదు, అది మన వ్యవసాయ ఆధారిత నాగరికతకు ప్రతిరూపం. తెలుగు వారి సంప్రదాయాన్ని ప్రతిబింబించే గంగిరెద్దులాట అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వం ఈ కళాకారులను గుర్తించి, పెన్షన్లతో పాటు ఎద్దుల మేతకు సబ్సిడీ వంటి రాయితీలు కల్పించి, ఈ జానపద కళను కాపాడాలి. సాంస్కతిక ప్రదర్శనల్లో వారికి ప్రాధాన్యత కల్పించాలి.
మా తాతలు, తండ్రుల కాలంలో మాకు రాజమర్యాదలు జరిగేవి. ఇప్పుడు పట్టణాల్లో అయితే అడుక్కునే వారిలా చూస్తున్నారు. ఎద్దును చూసి మురిసిపోయే కాలం పోయింది. ఎద్దు పొట్ట నింపడమే ఇప్పుడు మాకు గగనమైపోయింది దీంతో చాలా మంది ఈ కష్టాన్ని భరించలేక కూలీ పనులకు వెళ్తున్నారు.
– ఆవుల మంగయ్య, గంగిరెద్దుల కళాకారుడు
జాడ లేని డూడూ బసవన్నలు
జాడ లేని డూడూ బసవన్నలు
జాడ లేని డూడూ బసవన్నలు


