ఉత్తమ వర్జీనియా రైతుగా షేక్ బాజీ
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురానికి చెందిన షేక్ బాజీ ఉత్తమ వర్జీనియా రైతు అవార్డును అందుకున్నారు. గుంటూరులో శుక్రవారం జరిగిన పొగాకు బోర్డు గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, వేలం డైరెక్టర్ బి.శ్రీనివాస్, కార్యదర్శి డి.వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకు పండించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రైతులను పొగాకు బోర్డు సత్కరించి, అవార్డులు అందిస్తుందన్నారు.
కొయ్యలగూడెం: సెంట్రల్ ఎకై ్సజ్ సవరణ చట్టం 2025 ద్వారా పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జాతీయ ప్రధాన రహదారిపై ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ నాయకులు రైతులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, దేశీయ మార్కెట్‌లో ధరలు స్ధిరంగా ఉండటం, సాగు ఖర్చులు పెరగడం, నియంత్రణ కారణంగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో అధిక పన్నులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపడంతో పాటు, అక్రమ వ్యాపారం పెరుగుతుందన్నారు.
చింతలపూడి: చింతలపూడి మండలం పట్టాయిగూడెం, ఊటసముద్రం గ్రామాల్లో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.28,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాల మేరకు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. పట్టాయగూడెంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.16,800 నగదు, ఊటసముద్రంలో 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.11,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దెందులూరు: పోతునూరు గ్రామంలో రొయ్యల చెరువులపై కాపలా కాస్తున్న సత్తనపల్లి రవి ఆత్మహత్య చేసుకున్నాడు. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన రవి శుక్రవారం సాయంత్రం చెరువులో వాడే టాబ్లెట్లు అధిక మొత్తంలో సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసి మృతికి గల కారణాలను విచారిస్తున్నామని ఎస్సై అన్నారు.
ఉత్తమ వర్జీనియా రైతుగా షేక్ బాజీ
ఉత్తమ వర్జీనియా రైతుగా షేక్ బాజీ


