గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన రెండో రోజుకు
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో గెస్ట్‌ఫ్యాకల్టీ వేతనాలను యాజమాన్యం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్జీయూకేటీ కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళన శుక్రవారం రెండో రోజుకు చేరింది. దీనిలో భాగంగా ట్రిపుల్‌ఐటీ ప్రధాన గేటు వద్ద గెస్ట్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ 2018లో నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 44మందిని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారని, అప్పటి నుంచి రూ.25వేల వేతనానికే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీతో పాటు డాక్టరేట్ చేసిన టీచర్లు ఎక్కడైనా ఇంత తక్కువ వేతనానికి పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తమ వేతనాలను పెంచాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఏడేళ్లుగా వేతనాన్ని ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమతో పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భవ్యశ్రీ, రవినాయక్, విశ్వనాఽథ్, సునీత, రాజేంద్రరెడ్డి, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
స్పందించకపోవడం దారుణం
ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్లు పరిష్కరించాలని గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అనాగరికమని సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి జీ.రాజు ధ్వజమెత్తారు. ఈ దీక్షకు సీఐటీయూ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు.


