కౌలు రైతుల రక్షణకు చట్టం తేవాలి
ఏలూరు(టూటౌన్): కౌలు రైతుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, రబీ పంట రుణాలు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో దేవాలయ కౌలు రైతుల సమావేశాన్ని అనగాని శ్రీరామ్మూర్తి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకు మేలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఆలస్యం చేయడం తగదన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేలా కొత్త కౌలు రైతుల చట్టం తేవాలన్నారు. ప్రతి కౌలు రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలన్నారు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన సర్వీస్ ఇనాం భూముల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి పంట రుణాలు, నష్టపరిహారాలు, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. వడాలి ఇనాం భూముల కౌలు రైతుల హక్కులు కాపాడాలన్నారు. పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పల్లి శ్రీధర్, కుంచాల బుల్లిబాబు, కొరికాని వెంకటేశ్వరరావు, బెండు పాపారావు, వెలమల రాంబాబు, ముంగట నాగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


