సంతకాలకు కోటెత్తారు
సాక్షి, భీమవరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమానికి జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది. పేదలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యాన్ని దూరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రలను నిరసిస్తూ ఊరువాడ ఏకమయ్యాయి. విద్యార్థులు, యువత, మేధావులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో లక్ష్యానికి మించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరంలో సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో గుడాల శ్రీహరిగోపాలరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఉండిలో సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థలు, గ్రామగ్రామాన రచ్చబండలు ఏర్పాటుచేసి ప్రైవేటీకరణ నష్టాలను వివరిస్తూ ప్రజల నుంచి సంతకాలు సేక రించారు. పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనుబంధ విభాగాల వారు ఉత్సాహంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. మంగళవారం భీమవరంలో జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మీ, యుగంధర్ దంపతులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తమ అనుచరులతో భీమవరంలోని విద్యాసంస్థలతో పాటు పలుచోట్ల సంతకాల సేకరణ చేశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాల ప్రతులను నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతం చేయడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు కుట్రలకు ప్రజాస్పందన చెంపపెట్టని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. బుధవారం సంతకాల ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు అనంతరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. ఈనెల 15వ తేదీన భీమవరంలో భారీ ర్యాలీ అనంతరం గవర్నర్‌కు అందజేసేందుకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు.
జిల్లాలో విజయవంతంగా కోటి సంతకాల సేకరణ
చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
లక్ష్యానికి మించి అనూహ్య స్పందన
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
సంతకాలకు కోటెత్తారు


