నాయకులు, కార్యకర్తల కృషి అమోఘం
భీమవరం: అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కళ్యాణి తెలిపారు. మంగళవారం భీమవరంలో ఎండీ హసీనా బేగం అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కూటమి పార్టీలు ధర్నాలకు మద్దతునిచ్చి అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా జీతాల సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 164 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త ఫోన్లు ఇవ్వాలని, యాప్‌ల పని భారాన్ని తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.
తణుకు అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే చంద్రబాబు సర్కారు కుట్రకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో సంతకాలు చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కోటి సంతకాల సేకరణలో పూర్తి సహకారం అందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమాన్ని అందరికీ అందిస్తానని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నేటికి రూ. 2.66 లక్షల కోట్ల అప్పులు చేశారని, కేవలం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే పూర్తిగా అందుబాటులోకి వచ్చే ప్రభుత్వ వైద్య కళాశాలలను దుర్మార్గంగా ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం వల్ల జగన్‌మోహన్‌రెడ్డికో, కారుమూరికో మంచి జరగడానికి కాదని పేదలకు అందాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారని స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గంలో 78,235 సంతకాలు సేకరించామని, అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాలు చేయించగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. బుధవారం ఉదయం ర్యాలీగా వెళ్లి భీమవరంలో ఈ సంతకాల ప్రతులను అందచేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, ఇరగవరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్‌లు బుద్దరాతి భరణీప్రసాద్, ఉండవల్లి జానకి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి


