రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టు కోచ్‌గా సంకు సూర్యనారాయణ
తణుకు అర్బన్: రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టు కోచ్‌గా సంకు సూర్యనారాయణ నియమితులయ్యారు. హరియాణాలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనే అండర్–19 ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్‌గా తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను నియమిస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు అందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. రాష్ట్ర జట్టుకు కోచ్‌గా ఐదోసారి ఎంపికైన సూర్యనారాయణను పలువురు ప్రముఖులతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
భీమవరం: వృద్ధురాలి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఏఎస్సై ఎన్ వెంకట్రావు బుధవారం చెప్పారు. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన సీహెచ్ శశిరేఖ (85) మతిస్థిమితం లేక మంగళవారం ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై ఆమె కోడలు మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చెప్పారు.
జంగారెడ్డిగూడెం: ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెంలోని జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై ఎన్‌వీ ప్రసాద్, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంకు చెందిన వీపు వెంకటేష్, తూంపాటి జీవరత్నం మోటార్‌సైకిల్‌పై అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారి మోటార్‌సైకిల్‌ను తనిఖీ చేయగా, వారి వద్ద మూడు గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని విచారించగా, ఒరిస్సా నుంచి వీటిని తీసుకువస్తున్నట్లు చెప్పారు. కాగా గంజాయి ప్యాకెట్లలో ఒకటి 1.420 కేజీలు ఉండగా, మరో రెండు ప్యాకెట్లు 105 గ్రాముల చొప్పున ఉన్నాయి. మొత్తం 1.630 కేజీల గంజాయిని పట్టుకుని, వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సుభాష్ చెప్పారు.
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ఇంజినీరింగ్ తృతీయ, ఆఖరి సంవత్సర విద్యార్థులు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) పరీక్షల్లో 97.5 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ బుధవారం తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు 140 ఎన్‌పీటీఈఎల్ కోర్సులను ఎంపిక చేసుకున్నారన్నారు. విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రతిభను కనబరిచి మంచి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించినట్లు వివరించారు. నాలుగు ట్రిపుల్‌ఐటీలు కలిపి 10,113 మంది విద్యార్థులు ఎన్‌పీటీఈఎల్ సర్టిఫికెట్లు పొందగా నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన 2,473 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారని పేర్కొన్నారు. ఎన్‌పీటీఈఎల్ కోర్సులను ఐఐటీలు, ఐఐఎస్సీ లాంటి దేశవాళీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల భాగస్వామ్యంతో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టు కోచ్‌గా సంకు సూర్యనారాయణ
రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టు కోచ్‌గా సంకు సూర్యనారాయణ


