మొదలైన ‘విభజన’ సెగ | - | Sakshi
Sakshi News home page

మొదలైన ‘విభజన’ సెగ

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

అప్పట్లో ప్రజలు కోరినట్టుగా..

నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి

ద్వారకాతిరుమల: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల దృష్టి చిన్నతిరుపతిపై ఎప్పుడూ ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రముఖ రాజకీయ నాయకుల తాకిడి కూడా క్షేత్రానికి ఎక్కువే. జిల్లాలో ఏ రాజకీయ కార్యక్రమం జరిగినా ద్వారకాతిరుమలను సందర్శించక మానరు. ఎన్నికలొస్తే చాలు.. నామినేషన్‌ పత్రాలతో అభ్యర్థులు స్వామివారి చెంతకు చేరతారు. శ్రీవారి ఆశీస్సులు ఉంటే ఎన్నికల్లో గెలుపు తథ్యమన్న సెంటిమెంట్‌ నాయకుల్లో బలంగా ఉంది. 2022లో వైఎస్సార్‌ సీపీ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో గోపాలపురం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతున్నట్టు తెలుసుకున్న పలు రాజకీయ పార్టీల నేతలు జేఏసీగా ఏర్పడి, ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలోనే ఉంచాలని ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఐకాన్‌గా ఉన్న ఏకై క ప్రముఖ క్షేత్రాన్ని తమకు దూరం చేయొద్దని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు కోరారు. దాంతో ప్రజాభీష్టమే తమ ఇష్టమని కొందరు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ విషయాన్ని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో, మిగిలిన నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు రావడంతో.. ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలన్న అంశం తెరమీదకొచ్చింది.

జేఏసీ ఏర్పాటుకు సన్నద్ధం

కూటమి ప్రభుత్వం ప్రజలు కోరుతున్న విధంగా ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా చేస్తుందా? లేదా? అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే జిల్లాలో ఏఏ మండలాలను కలిపి నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు అనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. అయితే భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాలను కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి, ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని అంతా కోరుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలసి జేఏసీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

రాజకీయ ఎత్తుగడలు

నియోజకవర్గాల పునర్విభజనపై కొందరు కూటమి నేతలు అప్పుడే రాజకీయ ఎత్తుగడలను మొదలుపెట్టారు. ఉంగుటూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాలను కలిపి నియోజకవర్గం చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే, భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాలను కలిపి నియోజకవర్గం చేయించాలని మరి కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఏఏ మండలాలను కలిపితే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే దానిపై ముఖ్య నేతలు దృష్టి సారించారు.

పార్లమెంట్‌ పరిధి కూడా..

గతంలో ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న ద్వారకాతిరుమల మండలాన్ని, అలాగే చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న ద్వారకాతిరుమల మండలంలోని రామన్నగూడెం, వెంకటకృష్ణాపురం, గుండుగొలనుకుంట పంచాయతీలను 2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గోపాలపురం నియోజకవర్గంలో కలిపారు. దాంతో అప్పటి వరకు ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఈ మండలాలు కాస్తా.. రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోకి చేరాయి. అప్పటి నుంచి రాజమండ్రి పార్లమెంట్‌ నిధులు శివారులో ఉన్న ద్వారకాతిరుమల మండల అభివృద్ధికి అరకొరగానే వచ్చాయన్న విమర్శలున్నాయి. అలాగే పార్లమెంట్‌ సభ్యుని కలవాలంటే 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి వెళ్లాల్సి వస్తోందని సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి ఈసారి జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా, పార్లమెంట్‌ పరిధి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో ఉండేలా చేయాలనే ప్రధాన ఎజెండాతో పోరాడేందుకు ప్రజలు, పలు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు.

జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజలు కోరినట్టుగా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాన్ని ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో చేర్చాలనే ప్రధాన ఎజెండాతో ముందుకెళ్తాం. జేఏసీని ఏర్పాటు చేసి, కార్యాచరణను రూపొందిస్తాం.

– పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, గోపాలపురం నియోజకవర్గం

ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి. అందుకు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కృషి చేయాలి. భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాలను కలిపి, నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇలా చేస్తే క్షేత్రం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది.

– మొగతడకల శ్రీనివాసరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు

ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రం చేసి.. ఏలూరు పార్లమెంట్‌లో కలపాలంటున్న ప్రజలు

జేఏసీగా ఏర్పడేందుకు సిద్ధపడుతున్న రాజకీయ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement