బీఫార్మసీ విద్యార్థిని కేసులో పురోగతి | - | Sakshi
Sakshi News home page

బీఫార్మసీ విద్యార్థిని కేసులో పురోగతి

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

ఇద్దరు స్నేహితుల వేధింపులతోనే ఆత్మహత్య

అరెస్ట్‌ చేసిన ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు

ఏలూరు టౌన్‌: ఏలూరులో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఇద్దరు విద్యార్థులను ఏలూరు త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం కూచంపూడి గ్రామానికి చెందిన చిలుకూరి సువర్షిణి (20) ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ విద్యాసంస్థల బీఫార్మసీ కళాశాలలో మూడవ ఏడాది బీఫార్మసీ చదువుతుంది. ఆమె కళాశాల హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటుంది. మార్చి 25న అర్ధరాత్రి సమయంలో విద్యార్థిని సువర్షిణి కాలేజీ హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై రాంబాబు దర్యాప్తు చేయగా ... ప్రేరేపిత ఆత్మహత్యగా నిర్థారణ అయ్యింది.

స్నేహితులే కాలయముళ్లు

బీఫార్మసీ విద్యార్థిని సువర్షిణికి క్లాస్‌మేట్స్‌ బెల్లాని రాటాలు, బూరుగుపల్లి విజయసారధితో మొదటి ఏడాది నుంచి పరిచయం ఏర్పడింది. ముగ్గురూ ఫోన్‌కాల్స్‌ చేసుకోవటం, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌ సంభాషణలతో స్నేహం కొనసాగించినట్లు పోలీస్‌ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే సువర్షిణి స్నేహితుడు విజయసారధి మద్య కొంత వ్యక్తిగత చాట్‌ జరిగింది. ఈ చాట్‌ను విజయసారధి సేవ్‌ చేసుకున్నాడు. కొంతకాలం అనంతరం ఇరువురి మద్య మనస్పర్థలు ఏర్పడటంతో అతడ్ని దూరం పెట్టింది. కక్ష పెంచుకున్న విజయసారథి ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేస్తూ ఉన్నాడు. మార్చి 24న జరిగే ఫేర్‌వెల్‌ ఏర్పాట్ల సందర్భంగా క్లాస్‌రూమ్‌లో జరిగిన సంభాషణల్లో విజయసారథి విద్యార్థిని సువర్షిణి పట్ల అసభ్యంగా మాట్లాడి అవమానించినట్లు విచారణలో వెల్లడైంది. తనతో చేసిన వ్యక్తిగత చాట్‌ను ప్రస్తావిస్తూ ఆమెను ఇతరుల ముందు హేళన చేశాడు. అవమానంతో కుంగిపోయిన సువర్షిణి కాలేజీ అధ్యాపకులకు, యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని చెప్పారు. 25న ఫేర్‌వెల్‌ ముగిసిన అనంతరం తన కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపిన సువర్షిణి సాయంత్రం 6.30 గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చింది. మరో స్నేహితుడు రాటాలు ఫోన్‌ చేసి మృతురాలితో ప్రైవేట్‌ చాట్‌ను ప్రస్తావిస్తూ ... కళాశాల యాజమాన్యానికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే చాట్‌ను ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులకు పంపుతామనీ, పరువు తీస్తామని బెదిరించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన సువర్షిణి ఈ విషయాన్ని తన తండ్రికి, స్నేహితులకు చెప్పింది. తండ్రి మరుసటి రోజు వచ్చి ఇంటికి తీసుకువెళతానని చెప్పారు. కానీ తన వ్యక్తిగత చాట్‌ బయటపడుతుందనే భయంతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థిని రాత్రి సుమారు 11.34 గంటలకు హాస్టల్‌ భవనం పై అంతస్తుకు వెళ్లి టెర్రస్‌ పైనుంచి కిందికి దూకింది. ఆమె స్నేహితులు గుర్తించి ఆటోలో ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ రిఫర్‌ చేశారు. అనంతరం ఏలూరులోని ఆంధ్ర హాస్పిటల్‌లో చూపించి, మళ్లీ తిరిగి ఏలూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చి చేర్పించగా చికిత్స పొందుతూ 26తేదీన ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో మృతిచెందింది. ఈ కేసు దర్యాప్తులో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు మృతురాలు సువర్షిణి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలేజీ అధ్యాపకులను సమగ్రంగా విచారించారు. సీసీటీవీ పుటేజ్‌ పరిశీలించటంతోపాటు, పలు ఆధారాలను సేకరించి విద్యార్థిని సువర్షిణి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన బెల్లాని రాటాలు, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామానికి చెందిన బూరుగుపల్లి విజయసారథిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనీ, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement