● ఆస్తి వివాదంలో బంధువు దాడి
● ఉండిలో ఘటన
ఉండి: వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షుడు, జిల్లా యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి శేషాద్రి శివశంకర నాగకుమార్ (శ్రీను)పై హత్యాయత్నం జరిగింది. దీనిపై బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన శేషాద్రి శివశంకర నాగకుమార్ అనే వ్యక్తికి అతడి మేనత్త మనుమడైన దోసా ఫణీంద్రకుమార్‌కు కొద్దికాలంగా ఆస్తి తగదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. పెద్దలు చేప్పిన మాటలకు ఒప్పుకుని వెళ్లిన ఫణీంద్ర మరలా తిరిగిరాలేదు. సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో శేషాద్రి శ్రీను అతడి భార్య ధనలక్ష్మి ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న సమయంలో ఫణీంద్రకుమార్ అతడి భార్య అనితతో ఇంట్లోకి వచ్చి ఆస్తి పంచమంటే పంచవేంట్రా అంటూ తమతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన శ్రీను, అతడి భార్య ధనలక్ష్మి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. వారిని వెంబడించిన బాధితుడి భార్య ఇంటి బయట మరో ముగ్గురు ఉండటం గమనించింది. శ్రీనును స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భీమవరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. శస్త్రచికిత్స అనంతరం ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. బాధితుని భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.


