ముసునూరు: గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్, ముసునూరు బాలికల గురుకుల ప్రిన్సిపాల్ కాకర్ల లక్ష్మీకుమారి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని వివిధ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8 తరగతుల ఖాళీలు, ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాల వివరాల సంబంధిత ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 31తో ముగియగా, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.
ఏలూరు (టూటౌన్): ప్రకృతి వ్యవసాయ విస్తరణపై జిల్లాస్థాయి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టిఓటి)కు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా తొలిరోజు మంగళవారం ఏలూరు ఐఏడీపీ హాల్లో శిక్షణ నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ బాషా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించి, జిల్లాలో జరుగుతున్న అమలు విధానాలను తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.వెంకటేష్ ఏలూరు జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యకలాపాలు, మండలాల వారీ అమలు విధానాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ (రిటైర్డ్ ఐఏఎస్) జూమ్ మీటింగ్‌లో శిక్షణలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలపై మార్గదర్శకాలు అందించారు. అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
కామవరపుకోట: తననే పెళ్లిచుకోవాలని యువతిని బెదిరించిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తడికలపూడి ఎస్సై చిన్నారావు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోటకు చెందిన ఓ యువతి త్వరలో వివాహం చేసుకోబోతుండగా, కొత్తూరు గ్రామానికి చెందిన రాజకుమార్ తన స్నేహితులైన కిషోర్‌బాబు, అభిలాష్‌తో కలిసి ఆమెను లక్ష్యంగా చేసుకుని ‘నన్ను తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోకూడదు’అంటూ ఆమె ఇంటికి వెళ్లి దాడికి యత్నించి పలుమార్లు బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి తల్లిదండ్రులు తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని సోమవారం రాత్రి చింతలపూడి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 12 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై చెన్నారావు చెప్పారు.
ఏలూరు (టూటౌన్): అంగన్‌వాడీలకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఏలూరు సీడీపీఓ ఆఫీస్ వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బేబిరాణి మాట్లాడుతూ గడచిన ఏడేళ్లుగా అంగన్‌వాడీలకు ప్రభుత్వం వేతనాలను పెంచలేదని విమర్శించారు. ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు అనకాపల్లి అంగన్‌వాడీలు చేస్తున్న ధర్నా శిబిరాల వద్దకు వచ్చి అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత బోడి మల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుటి జీవో ఇచ్చినా గైడ్‌లైన్ రూపొందించకపోవడం వలన అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు సీఐటీయూ ఏలూరు నగర కార్యదర్శి ఎం ఇసాక్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు టి రజిని, షేక్ సమీమా నాయకత్వం వహించారు.
భీమవరం అర్బన్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో భార్యభర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం ప్రాంతానికి చెందిన దోనపాటి రమేష్, అతని భార్య ధీన తాలూకా ఆఫీసు వద్ద చెట్టుకింద ఫిర్యాదులు రాస్తుంటారు. మంగళవారం లోసరి నుంచి భీమవరం వైపు ద్విచక్ర వాహనంపై వీరు వస్తుండగా కట్టావారిపాలెం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి మారుతీకారు ఢీకొంది. ఈ ఘటనలో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న భార్యభర్తలతోపాటు కారు కూడా పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దోనపాటి రమేష్, ధీనలకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


