ఏ మాత్రం తగ్గని మేత ధర
శాసించేది కూటమి నాయకులే..
ఆకివీడు: ఉద్యమించిన రైతులకు పెంచిన రొయ్యల ధరలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. రొయ్యల ధరల పతనం, మేత ధరలు ఆకాశాన్నంటడంతో రైతులు ఇటీవల ఆందోళన చేపట్టారు. భవిష్యత్‌లో ఇదే పరిణామాలు కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో ఎగుమతిదారులు మొక్కుబడిగా రొయ్యల ధరల్ని పెంచారు. అయితే పెంచిన ధరలకు షరతులు విధిస్తూ 3 టన్నుల పైబడి పట్టుబడి ఉన్న రొయ్యలకు మాత్రమే ఈ ధర అని ప్రకటించడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. గత కొన్ని నెలలుగా ఆక్వారైతులు రొయ్య ధరల పతనం, ఎగుమతి దారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు తమ సమస్యలపై ఎలుగెత్తి చాటినా చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. రొయ్యల ధరలు స్థిరీకరణ, మేత ధరల తగ్గిపు పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రొయ్యల ధరలు పతనమైనా, మేత ధరలు పెంచినా వెంటనే ఎగుమతిదారులతోనూ, మేత ఉత్పత్తి దారులతో సమావేశాలు నిర్వహించి రైతులకు మేలు చేశారు. ఆ పరిస్థితి నేడు కన్పించడంలేదని రైతులు లబోదిబోమంటున్నారు.
రొయ్యపై అంతర్జాతీయ ప్రభావం
యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్‌లో ఒడుదుడుకులు ప్రారంభమయ్యాయి. ఎగుమతులపై ప్రభావం పడటంతో ధరల్ని తగ్గించివేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం తీవ్రతరం అవ్వడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధ నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతుల్లో ఏర్పడిన ఇబ్బందులను ఎగుమతిదారులు ఆసరాగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం 100 సమీపంలోని కౌంట్ ఉన్న రొయ్యల్ని చైనా, వియత్నాం ఎగుమతి చేస్తున్నారు. వీటి ధర ఆశాజనకంగా ఉన్నా మూడు టన్నుల పైబడి సరుకు ఉండాలనే ఆంక్షలతో రైతులు విలవిలలాడుతోన్నారు.
ప్రస్తుతం
రొయ్యల ధరలు ఇలా..
100 కౌంట్ 250
90 కౌంట్ 260
80 కౌంట్ 280
70 కౌంట్ 285
60 కౌంట్ 295
50 కౌంట్ 315
40 కౌంట్ 345
30 కౌంట్ 470
రైతులకు అందని ద్రాక్షగా పెంచిన రొయ్యల ధరలు
టన్నుల మతలబుతో ధర పతనం
యుద్ధ క్రీనీడల ప్రభావం
మేత ధరలు పెరిగినా సాగు కొనసాగింపు
వైరస్‌లను అధిగమించినా లభించని ధర
రైతులు సమైక్యంగా ఉద్యమించి హెచ్చరించినా మేత ధరల్లో ఏ మాత్రం తగ్గింపులేదు. మేత ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 100 కౌంటుకు టన్ను మేత ధర లక్ష పైబడే ఉంది. వీరవాసరంలో చేపట్టిన ఉద్యమంకు ముందు ఎంత ధర ఉందో ఇప్పుడూ అంతే ధర ఉంది. 100 కౌంటుకు కేజీకీ రూ.250 అవుతుంది. ప్రస్తుతం ఽరొయ్య కేజీ ధర రూ.235 (టన్ను ధర 2.35 లక్షలు) మాత్రమే ఉంది. పెంపకం ధర అధికంగా ఉండటంతో రైతుకు నష్టమే వస్తుంది. అనధికారికంగా రొయ్యల్ని కొనుగోలు చేయడంలేదు. మూడు టన్నులుకు పైబడి ఉంటే రూ. 250కు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఉంటే రూ.15 తగ్గించివేస్తున్నారు.
ఆక్వా రంగంలో ఎగుమతి, సీడ్, ఫీడ్, నీడ్స్ అన్నీ కూటమి నాయకుల చేతుల్లోనే ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకూ ధరలు పెంచడం, రొయ్యల ధరలు తగ్గించడం వంటివి వారి ఇష్టానుసారం సాగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూటమి నాయకులే అధిక శాతం వ్యాపారాల్లో కొనసాగుతున్నారంటున్నారు. జగన్ ప్రభుత్వంలో జగన్ వల్లే ధరలు పడిపోయాయని కూటమి నాయకులు అసత్య ప్రచారం చేశారని, చంద్రబాబు పాలన ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకూ ధరల స్థిరీకరణ పనులు చేపట్టలేదని రైతులు వాపోతున్నారు. దళారుల్ని దింపి ధరల్ని తగ్గించివేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.


