నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు మూడు రోజులుగా కోడిగుడ్డు పెట్టడం లేదు. ఒకవైపు చికెన్ అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి విదితమే. అయితే ఈనెల 24నుంచి కోడిగుడ్లూ కూడా పెట్టకుండా అర్ధంతరంగా నిలిపివేశారు. నెల రోజుల నుంచి విద్యార్థులకు కోడిగుడ్లు, చికెన్‌ను అందించే బాధ్యతను ఆర్జీయూకేటీ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ తీసుకుంది. విద్యార్థులకు చికెన్, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదనే విమర్శలు రావడంతో.. ఆ సంస్థ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతోనే విద్యార్థులకు మూడు రోజులుగా కోడిగుడ్లు అందడం లేదని సమాచారం. విద్యార్థులకు కోడిగుడ్లు అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మంచి ఆహారం అందించేందుకు కృషి
విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నామని నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో సాక్షి దినపత్రికలో ట్రిపుల్ ఐటీపై వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే గవర్నింగ్ కౌన్సిల్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు మాంసాహారం అందించే బాధ్యతను ఇచ్చిందన్నారు. చికెన్ అయిపోయిందని భావించి ఈ4 విద్యార్థులు ఆందోళనకు దిగారే తప్ప చికెన్ సరిపోని కారణంగా కాదన్నారు.


