భీమవరం(ప్రకాశంచౌక్): పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రధాన అర్చకుడు చెరుకూరి రామకృష్ణ సాయంకాల విశేష అలంకరణ జరిపారు. ఉమాసోమేశ్వర స్వామివారిని సుమారు 4,500 మంది భక్తులు దర్శించున్నారని ఈఓ కృష్ణంరాజు తెలిపారు. దర్శనం, అభిషేకం టికెట్ల ద్వారా రూ.54,341, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,525, నిత్యాన్నదాన ట్రస్టు నందు కానుకల రూపంలో రూ.1,60,312 ఆదాయం లభించిందని ఈవో చెప్పారు.
తణుకు అర్బన్: జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ హైస్కూలు ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణ ఎంపికయ్యారు. నాగార్జున యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ పోటీల్లో 1,500 మీటర్ల పరుగు పందెంలో ఆయన ప్రథమ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చేనెల 13 నుంచి 15వ తేదీ వరకు బిహార్ రాష్టంలోని పాట్నాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో సూర్యనారాయణ పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సూర్యనారాయణను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు.
తణుకు అర్బన్: తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని మానె మనోజ్ఞ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం జిల్లాలోని పర్వాడ ఐకాన్ స్పోర్ట్స్ హబ్‌లో నిర్వహించిన పోటీల్లో బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో మానె మనోజ్ఞ ద్వితీయ స్థానం సాధించిందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి విద్యార్థినిని అభినందించారు.
విశేష అలంకరణలో సోమేశ్వరస్వామి
విశేష అలంకరణలో సోమేశ్వరస్వామి


