విద్యుదాఘాతంతో జేసీబీ ఆపరేటర్ మృతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరపాలక సంస్థలో అవుట్ సోర్సింగ్ జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సీహెచ్ రమేష్ (35) బుధవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన రమేష్ ప్రస్తుతం ఏలూరు చాణక్యపురి కాలనీలో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం స్థానిక అశోక్ నగర్ స్మృతి వనంలో జేసీబీతో శుభ్రం చేస్తూ ఉండగా జేసీబీ విద్యుత్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
భీమడోలు: ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను బుధవారం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. గుండుగొలను గ్రామానికి చెందిన నిట్టా నాగరాజుపై అదే గ్రామానికి చెందిన గొల్ల గౌతమ్, కాళీ రాజకుమార్, బొంతు శివకుమార్, సిరికోటి నరేంద్ర వర్మ ఈనెల 18వ తేదీ దాడి చేసి బీరు బాటిల్ పగలకొట్టి పొట్టలో పొడిచారు. తీవ్రగాయాలైన నాగరాజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఎస్సై ఎస్‌కే మదీనా బాషా అరెస్ట్ చేసి భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు చెప్పారు.
ఆకివీడు: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆకివీడు మండలంలోని సిద్ధాపురంనకు చెందిన కలిదిండి సత్యనారాయణరాజు 2021 డిసెంబర్ 10వ తేదీన వ్యవసాయ పనుల నిమిత్త కాళింగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సరిహద్దులోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కలిదిండి ఇంద్రరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై బీవై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో లారీ డ్రైవర్ బండ్రెడ్డి వీర వెంకట సత్యనారాయణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ బుథవారం భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జీ.సురేష్ బాబు తీర్పు వెలువరించారని ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు.
భీమవరం: భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగిన చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 17న సుమారు రూ.15 లక్షలు విలువ కలిగిన బంగారు వడ్డానం, లాకెట్ ముక్కలు కలిగి ఉన్న సంచితో బస్ ఎక్కుతుండగా మరో వ్యక్తి బస్సు ఎక్కుతున్నట్లుగా నటించి ఆ సంచిని దొంగిలించాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయగా వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడిని అదుపులోనికి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.


