ఉప్పులూరులో కొనసాగుతున్న వైద్య శిబిరం
ఉండి: ఉప్పులూరులో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో రెండోరోజు బుధవారం వైద్య శిబిరం కొనసాగించారు. వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరాలపై సర్వే నిర్వహించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు. యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఐసీ కీర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 30 మంది రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వారిలో 10 మందికి జ్వరాలు ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో వారికి డెంగీ పరీక్షలు పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే ఎవ్వరికీ డెంగీ నిర్ధారణ కాలేదని, అవన్నీ సాధారణ జ్వరాలేనని వైద్య బృందం స్పష్టం చేసింది. వైద్యశిబిరాన్ని, ఫీవర్ సర్వేలను జిల్లా మలేరియా అధికారి క్రాంతికుమార్, యూనిట్ అధికారి మూర్తి పర్యవేక్షించారు.


