ఉలిక్కిపడ్డ ఏలూరు
ఏలూరునే ఎందుకు ఎంచుకున్నారు?
మావోల జాడతో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మారేడుమిల్లిలో మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్ అనంతరం పలువురు మావోయిస్టులు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో పట్టుబడడం సంచలంనగా మారింది. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఏలూరు మినీ బైపాస్‌లోని గ్రీన్‌సిటీలో ఒకే ఇంట్లో 15 మంది మావోయిస్టులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ళ క్రితం వరకు మావోయిస్టుల కదలికలు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో ఉండేవి. ఎన్‌కౌంటర్లు కూడా జరిగేవి. అడపాదడపా షెల్టర్ జోన్‌గా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ అలజడి ప్రారంభమైంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కరోజే 51 మంది మావోయిస్టులను పక్కా స్కెచ్‌తో అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఏలూరు నగరంలో మంగళవారం మధ్యాహ్నం 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అందిన సమాచారంతో విజయవాడ నగరంలో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి సమాచారంతో ఏలూరులో ఉంటున్న వారి వివరాలు తెలుసుకున్నారు. రూ.12 వేల అద్దెకు సరిగ్గా 13 రోజులు క్రితం గ్రీన్‌సిటీలో ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఆపరేషన్ కగార్‌తో పేరుతో కేంద్రం వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు కేడర్‌ను తుద ముట్టిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న క్రమంలో మావోయిస్టులు షెల్టర్ జోన్ బాటపట్టారు. సొంత రాష్ట్రమైతే సమస్యలు ఉంటాయనే యోచనతో పొరుగు రాష్ట్రాలకు వలస వచ్చారు. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని ఫ్లటూన్, దళ సభ్యులు ముఖ్యుల ఆదేశాలతో షెల్టర్ జోన్‌గా ఏలూరు, విజయవాడ, కృష్ణా, కోనసీమ, కాకినాడ జిల్లాలను ఎంపిక చేసుకుని మూడు బృందాలు ఐదు ప్రాంతాలకు వచ్చారు. ఏలూరులో 15 మంది, విజయవాడ నగరంలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో 28, కోనసీమలో ఒకరు, కాకినాడలో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేశారు. వారిని ఆయా జిల్లాల డీటీసీలకు తరలించి ఎస్పీల నేతృత్వంలో విచారిస్తున్నారు.
దాదాపు 20 ఏళ్ళ క్రితం వరకు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం అలజడి వాతావరణం ఉండేది. మావోయిస్టులతో పాటు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, తెలంగాణ నుంచి విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో జనశక్తి, న్యూడెమోక్రసీ వర్గాల కదలికలు ఎక్కువగా కొనసాగేవి. ఈ క్రమంలో తరుచూ అరెస్టులు, లొంగుబాట్లు, చిన్నపాటి ఎన్‌కౌంటర్లు సాగేవి. 2009లో అప్పటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నివాసమైన బుట్టాయగూడెంలోని దుద్దుకూరులో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. బాలరాజు నివాసం వద్ద రెక్కీ నిర్వహించగా.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 2010లో పోలీసులకు, న్యూడెమోక్రసీ దళ కమాండర్‌కు ఎదురుకాల్పులు జరిగాయి. 2014లో బుట్టాయగూడెంలోని ఇప్పాలమ్మగుడి సమీపంలో పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉండేవి. గోదావరి పరీవాహక గ్రామాలను షెల్టర్‌జోన్‌గా ఏర్పాటుచేసుకుని మావోయిస్టులు కొనసాగేవారు. 2005లో కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేయడం అదే మండలంలోని బంజరగూడెం సమీపంలో కాంగ్రెస్ నేత మండవ రామిరెడ్డిని కాల్చిచంపిన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. 2007 వేలేరుపాడులోని రాళ్ళపూడి గ్రామంలో కోయిదా గ్రామస్తులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాళ్ళపూడి సమీపంలో పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసి ఐదుగురిని హతమారుస్తామని లేఖ విడుదల చేశారు. గతంలో బుట్టాయగూడెం కేంద్రంగా పోలీస్ ఆపరేషన్లు కొనసాగేవి.
ఏలూరు నగరం అందులోని గ్రీన్‌సిటీనే ఎంచుకున్నారనే దానిపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. 25 ఏళ్ళ క్రితం ఆడపాదడపా ఏలూరును షెల్టర్ జోన్‌గా వినియోగించుకునేవారు. అనారోగ్యానికి గురైన క్రమంలో వైద్యసేవల కోసం ఏలూరును కొన్ని సార్లు ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ నుంచి ఏలూరుకు 15 మంది సభ్యులు రావడానికి ఎవరు సహకరించారు? ఎవరి సహకారంతో ఇల్లు అద్దెకు తీసుకున్నారనే దానిపై విచారిస్తున్నారు. గ్రీన్‌సిటీలో కానిస్టేబుల్ మొదలుకొని సీఐ వరకు అనేక మంది పోలీసులు నివాసం ఉండటం, ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని ప్రాంతం కావడంతో గ్రీన్‌సిటీని ఎంపిక చేసుకుని ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు భావిస్తున్నారు.
మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా నగరం
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌తో షెల్టర్ జోన్‌కు రాక
గ్రీన్‌సిటీలో ఒకే భవనంలో 15 మంది మావోయిస్టులు
12 రోజులుగా మకాం ఉన్నట్లు నిర్ధారణ
పశ్చిమ ఏజెన్సీలో గతంలో మావోయిస్టులఎన్‌కౌంటర్లు, అరెస్టులు


