రోడ్డు ప్రమాదంలో డిజిటల్ అసిస్టెంట్ మృతి
బుట్టాయగూడెం: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలోని బండార్లగూడెంకు చెందిన పూనెం రామారావు (36) పోలవరం గ్రామ సచివాలయం–3లో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ బుట్టాయగూడెం మండలం అల్లికాల్వ సమీపం డౌన్‌లో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామరావు కింద పడిపోగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో స్థానికులు 108 వాహనం కోసం ఫోన్ చేయగా 2 గంటల సమయం పడుతుందని సమాధానం చెప్పడంతో ట్రాక్టర్‌లోనే రామారావును స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వచ్చారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా డిజిటల్ అసిస్టెంట్‌గా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో పనిచేసిన రామారావు ఇటీవలే పోలవరం మండలానికి బదిలీపై వచ్చారు. రామారావు భార్య రామలక్ష్మి బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రామలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపారు. రామారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


