
బాణసంచా.. ధరల మోత
ధరలు ఇలా.. (రూ.లలో)
సాక్షి, భీమవరం: బాణసంచా ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాదితో పోలిస్తే 20 నుంచి 40 శాతం మేర పెరిగి వినియోగదారులను బేజారెత్తిస్తున్నాయి. ముడి సరుకుల ధరల పెరుగుదల, స్థానికంగా తయారీ తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం, ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు.
జిల్లాలో 500 వరకు దుకాణాలు
జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లులో బాణసంచా హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నారు. శనివారం నాటికి 350 దుకాణాలకు పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు తాత్కాలిక లైసెన్సులు జారీచేశారు. మరో 150 వరకు దరఖాస్తులకు లైసెన్సులు ఇవ్వాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా బాణసంచా వ్యాపారం జరుగుతుందని అంచనా. బొగ్గు, గంధకం, అల్యూమినియం, సూరేకారం, బేరియం నైట్రేట్ తదితర ముడి సరుకుల ధరలు పెరిగిపోగా, స్థానికంగా తయారీ తగ్గిపోగా, శివకాశీ, ఇతర ప్రాంతాల నుంచి బాణసంచా తెస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అగ్గిపెట్టెలు, తారాజువ్వలు, మతాబులు, భూచక్రాలు, 1,000 వాలాలు తదితర వైరెటీలు, వాటి కంపెనీలను బట్టి 20 శాతం నుంచి 40 శాతం వరకు ధరలు పెరిగాయంటున్నారు. రూ.1,000 పెడితే సంచుడు బాణసంచా రావడం లేదని వినియోగదారులు అంటున్నారు.
ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి : సాధారణంగా నవంబరు మొదటి రెండు వారాల్లో దీపావళి రావడం, అదే సమయానికి ఖరీఫ్ కోతలు, మాసూళ్లు ముమ్మరంగా ఉండేవి. రైతులు, వ్యవసాయ కూలీల వద్ద డబ్బులు ఉండటం, ఉద్యోగులకు జీతాలు రావడం వలన బాణసంచా అమ్మకాలు ఆశాజనకంగా ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అక్టోబరు మూడో వారంలో దీపావళి రాగా, నవంబరులో కాని ఖరీఫ్ కోతలు ముమ్మరం కావు. మరోపక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మిక వర్గాలకు సరిగా పనులు లేవు. ఆయా ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది అమ్మకాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు.
బాణసంచా గతేడాది ఈ ఏడాది
(సుమారు)
అగ్గిపెట్టెలు (10 బాక్స్‌లు) 550 750
కాకర పువ్వొత్తులు
(10 బాక్స్‌లు) 600 750
విష్ణుచక్రాలు (10) 100 180
చిచ్చుబుడ్లు (డజను) 180 260
జువ్వ (100) 250 350
భూ చక్రాలు (10) 100 180
టపాకాయలు (25) 25 40
పేలుడు జువ్వ (100) 1,000 1,600
డిస్కో చిచ్చుబుడ్లు (12) 260 380
ధరలకు రెక్కలు
20 నుంచి 40 శాతం మేర పెరుగుదల
వినియోగదారుల బెంబేలు
ప్రతికూల వాతావరణంతో వ్యాపారుల్లో ఆందోళన

బాణసంచా.. ధరల మోత