
మందు బిళ్లలకు కోత
జిల్లాలోని ఒక ఆస్పత్రికి రోజుకు దాదాపు 400 వరకు ఓపీ నమోదవుతుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు మొదటి క్వార్టర్‌గా మందుల కోసం వైద్యారోగ్యశాఖ సుమారు రూ.10.5 లక్షలు, సర్జికల్స్‌కు రూ.3.3 లక్షలు బడ్జెట్ ఇచ్చింది. జూలై, ఆగస్టు, సెప్టెంబరుకు రెండో క్వార్టర్‌గా మందుల కోసం రూ.11.42 లక్షలు, సర్జికల్స్‌కు రూ.3.8 లక్షలు ఇచ్చింది. అక్టోబరు, నవంబరు, డిసెంబరుకు సంబంధించి ప్రస్తుత క్వార్టర్‌కు మందులకు రూ.8.5 లక్షలు, సర్జికల్స్‌కు రూ.2.42 లక్షలు మాత్రమే బడ్జెట్ ఇచ్చింది. రెండో క్వార్టర్‌తో పోలిస్తే మూడో క్వార్టర్ బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయి. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో దాదాపు ఇదే పరిస్థితి.
సాక్షి, భీమవరం: జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, మూడు సీహెచ్‌సీలు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 34 వరకు పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీలు వరకు ఉన్నాయి. రోజుకు 15,500 వరకు ఓపీ నమోదవుతుంది. సాధారణంగా యూనివర్శల్ (యూ), సబ్ డివిజనల్ (ఎస్), టెరిసరీ (టీ) కేటగిరీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు మందుల కేటాయింపు చేస్తుంటారు. రోజువారీ ఓపీ, పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా ప్రతి మూడు నెలలకు క్వార్టర్ ప్రాతిపదికన మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు వైద్యారోగ్య శాఖ బడ్జెట్ మంజూరు చేస్తుంది. ఆస్పత్రి స్థాయిని బట్టి మందుల కోసం అర్బన్ పీహెచ్‌సీలకు రూ.90 వేల నుంచి రూ.1.5 లక్షలు, రూరల్ పీహెచ్‌సీలకు రూ.1.75 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, సీహెచ్‌సీలకు సుమారు రూ.15 లక్షల వరకు, ఏరియా ఆస్పత్రులకు రూ.20 లక్షల వరకు, అలాగే సర్జికల్ సామగ్రికి నిధులను కేటాయిస్తారు. ఈ నిధులతో మూడు నెలల కాలానికి గాను ఆస్పత్రికి అవసరమైన మందులు, శస్త్రచికిత్సల పరికరాలను సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి వైద్య సిబ్బంది తెచ్చుకోవాలి.
బడ్జెట్‌లో కోత.. రోగులకు వెత
గతంతో పోలిస్తే మందులు, సర్జికల్స్‌కు సంబంధించి ప్రస్తుత క్వార్టర్‌కు బడ్జెట్ కేటాయింపులు తగ్గినట్టుగా తెలుస్తోంది. యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు యథావిధిగా కేటాయింపులు చేసినా సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కోత పడింది. తణుకులోని జిల్లా ఆస్పత్రితో పాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ఏరియా ఆస్పత్రులు, ఆకివీడు, పెనుగొండ, ఆచంటలోని సీహెచ్‌సీలకు రోజువారీ ఓపీ అధికంగా ఉంటుంది. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందే వారూ ఎక్కువే. ఆయా ఆస్పత్రులకు మూడో క్వార్టర్ బడ్జెట్‌లో 20 నుంచి 30 శాతం వరకు కోత పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులకు మందులు తగ్గి రోగులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్దినెలల క్రితం బీపీ అదుపులో ఉంచే ఎటన్‌లాల్ 50, నొప్పులు తగ్గేందుకు వినియోగించే ప్రియాబ్లిన్ టాబ్లెట్లు, రోగికి సత్తువనిచ్చే మెట్రోజిల్ సైలెన్లు తదితర రకాల మందులు సరిపడా సరఫరా లేక రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవసరమైన డ్రగ్స్‌తో ఇండెంట్ పెడుతున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లో కొన్నిరకాల మందులు అందుబాటులో లేక రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బంది లేదు
మందులకు కొరత లేదని, అవసరమైన మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్‌లో మిగిలి ఉన్న స్టాకు, రోజువారీ ఓపీ, మందుల వినియోగాన్ని బట్టి క్వార్టర్ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని డీసీహెచ్‌ఎస్ సూర్యనారాయణ తెలిపారు. అవసరమైతే ఆరోగ్యశ్రీ నిధుల నుంచి మందుల కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినట్టు వివరించారు.
ఏ మాత్రం శ్రద్ధ లేదు
ప్రమాదంలో ప్రజారోగ్యం
ప్రభుత్వాస్పత్రులపై కూటమి నిర్లక్ష్యం
మందులు, సర్జికల్ సామగ్రి బడ్జెట్ తగ్గింపు
20 నుంచి 30 శాతం మేర కోత
రోగులకు తప్పని ఇక్కట్లు

మందు బిళ్లలకు కోత