
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
అత్తిలి: పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, కూటమి సర్కారు వాటిని ప్రైవేటుపరం చేయడానికి పూనుకోవడం దుర్మా ర్గమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా గురువారం అత్తిలి మండలం పాలి, కె. స ముద్రపుగట్టు, అత్తిలి పెదపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేలా వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని దుయ్యబట్టారు. కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు సేవల కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు కుటిల యత్నాలను అడ్డుకునేలా జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రతిఒక్కరూ సంతకాల సేకరణకు ముందుకు వచ్చి గవర్నర్‌కు సమర్పించేందుకు సంఘీభావం తెలపాలని కోరారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజారోగ్యానికి జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చారని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచితే నేడు కూటమి సర్కారు అటకెక్కించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఏది చూసినా నకిలీ అని భయమేసే పరిస్థితి ఉందన్నారు. ప్రజలను లక్షాధికారులను చేస్తానని చంద్ర బాబు అబద్దాలు చెప్పి నట్టేట ముంచారని అన్నారు. తణుకులో పశువధ యథేచ్ఛగా సాగుతోందని, జూద క్రీడలకు నిలయంగా మారిందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దరాతి భరణీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, సర్పంచ్‌లు కేతా గౌరీపార్వతి, కసిరెడ్డి బాలలక్ష్మీనారాయణ, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబీబుద్దీన్, ఎంపీటీసీ సభ్యులు నల్లమిల్లి నాగమణి, అనిశెట్టి త్రిమూర్తులు, ఆడారి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ నాయకులు రంభ సూరిబాబు, పోలినాటి చంద్రరావు, సబ్బితి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు