
శ్రీవారి అంతరాలయ దర్శనం పునరుద్ధరణకు చర్యలు
ద్వారకాతిరుమల: ద్వారాకతిరుమల చినవెంకన్న ఆలయంలో పాత పద్ధతిలో స్వామివారి అంతరాలయ దర్శనం, అలాగే అంతరాలయం (అమ్మవార్లు) ముందు భాగం నుంచి భక్తులకు సాధారణ దర్శనం కల్పించేందు అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మధ్యాహ్నం ట్రయిల్‌రన్ వేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఏలూరుకు చెందిన ఆధ్యాత్మికవేత్త, హైకోర్టు న్యాయవాది అయ్యంగార్ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదు, ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. వివరాల్లోకి వెళితే. ఐదేళ్ల క్రితం కోవిడ్ కారణంగా అధికారులు శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని, అలాగే అమ్మవార్ల ముందు నుంచి భక్తులకు సాధారణ దర్శనాన్ని నిలిపివేశారు. కోవిడ్ నిర్మూలన అనంతరం ఇతర ఆలయాల్లో అంతరాలయ దర్శనాలు పునః ప్రారంభం అయిననా, శ్రీవారి ఆలయంలో మాత్రం పునరుద్ధరణ కాలేదు. దీంతో భక్తులు శ్రీవారిని, అమ్మవార్లను బయట (దూరం) నుంచే దర్శించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే అధికారులు అంతరాలయ దర్శనం టికెట్ రూ.500 లుగా నిర్ణయించి, దేవదాయశాఖ కమిషనర్ నుంచి ఎప్పుడో అనుమతులు పొందినా దానినీ అమలు పరచలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గతంలో ఉన్న చెక్కల ర్యాంప్‌ను మళ్లీ ఆలయ అంతరాలయం ముందు భాగంలో ఏర్పాటుచేశారు. భక్తులు తూర్పు గుమ్మం లోంచి ఆలయంలోకి ప్రవేశించి, చెక్కల ర్యాంపు మీదుగా వెళుతూ స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించే పాత విధానాన్ని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తికి అధికారులు వివరించారు. అయితే ఇన్నేళ్లుగా మూలనపడి ఉన్న చెక్కల ర్యాంప్ దెబ్బతినడంతో ట్రయిల్‌రన్ వేయడం కుదరలేదు. దీంతో ర్యాంపునకు మరమ్మతులు చేయించాలని ఈఓ ఆదేశించారు. ఈనెల 21న అమావాస్య తరువాత అంతరాలయం, సాధారణ దర్శనాన్ని పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, మిగిలిన రోజుల్లో పునరుద్ధరించాలని నిర్ణయించారు.
అయ్యంగార్ ఫిర్యాదు, ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో కదలిక