
కారు డిక్కీలో క్షతగాత్రురాలి తరలింపు
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● మహిళకు తీవ్రగాయాలు
● సమయానికి రాని 108 వాహనం
తణుకు అర్బన్: జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన తేతలిలో గురువారం చోటుచేసుకుంది. తేతలి ఇండస్ట్రీయల్ ఏరియాలోకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తుతెలియని మహిళను తాడేపల్లిగూడెం వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. వాహన సీటు దూరంగా పడిపోగా వాహనం తిరగబడిన తీరు ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో మహిళకు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీకొట్టిన వేగానికి ద్విచక్ర వాహనంతోపాటు మహిళ కూడా గాల్లోకి ఎగిరిపడినట్టు స్థానికులు చెబుతున్నారు.
108 కోసం అరగంట వేచిచూసినా..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసినా అరగంట వరకూ జాడ లేకపోవడంతో చేసేది లేక మహిళ పరిస్థితి చూసిన ప్రయాణికులు ఒక కారు వెనుక భాగంలో డిక్కీ తెరిచి పొడవాటి చెక్కను పెట్టి దానిపై ఆమెను పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. అయితే ఆ మహిళ ఎవరు, ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లారనే విషయాలు తెలియలేదు. ప్రమాదం జరిగిన తరువాత ఘటనా ప్రాంతానికి పోలీసులు వెళ్లారని అయితే ఎటువంటి వివరాలు తెలియకపోగా, బాధిత వర్గాల నుంచి ఫిర్యాదు కూడా రాలేదని తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు.
మహిళను కారు వెనుక భాగంలో ఎక్కించి తీసుకెళ్తున్న దృశ్యం
తేతలిలో గాయపడ్డ మహిళను చెక్కపై
పడుకోబెట్టి కారు ఎక్కిస్తున్న స్థానికులు

కారు డిక్కీలో క్షతగాత్రురాలి తరలింపు