
గంటల వ్యవధిలో యువతుల ఆచూకీ గుర్తించిన పోలీసులు
భీమవరం: భీమవరం ఒకటో పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు అదృశ్యం కాగా వారి ఆచూకీని గంటల వ్యవధిలో పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న ఇద్దరు యువతులు ఈ నెల 15న రాత్రి ఇంటికి వెళ్లలేదు. రాత్రి 12.30 గంటలకు యువతుల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య పర్యవేక్షణలో సీఐ ఎం.నాగరాజు, ఎస్సై బీవై కిరణ్‌కుమార్, సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో యువతుల చరవాణి లోకేషన్‌ను గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఉన్న ఆ ఇద్దరినీ గుర్తించి పట్టుకుని భీమవరం తీసుకొచ్చి కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే తిరస్కరించా
ఎంపీ పాక సత్యనారాయణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): గత ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం తనకు నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే సున్నితంగా తిరస్కరించానని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరసాపురం ఎంపీ సీటు పోటీకి అన్ని పార్టీలు తన పేరును సిఫార్సు చేశాయని చెప్పారు. తనకు రాజ్యసభ సీటు పొందడం కన్నా నరసాపురం లోక్‌సభ సీటుకు అన్ని పార్టీలూ కలిపి తన పేరు చెప్పడం సంతోషం కలిగించిందన్నారు. కార్మిక బోర్డు చైర్మన్ వి.బాబ్జీ, బీజేపీ నేతలు బి.ఆదిలక్ష్మి, పి.అన్నవరం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉంగుటూరు మండలం నాచుగుంటలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.