
అర్జీల పరిష్కారంలో చొరవ చూపాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా సమష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహూల్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌వో బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పీడి డాక్టర్ కెసీసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.