
చెప్పుకోదగ్గ పథకం ఏదీ లేదు
మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం రూరల్: రాజకీయాల్లో 40 ఏళ్ళ చరిత్ర ఉందని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే చంద్రబాబు తన పాలనలో బెల్టు షాపు పథకం తప్ప చెప్పుకోవడానికి ఏ ఒక్క పథకం మిగలలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో శ్రీబాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీశ్రీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు దాదాపు వెయ్యి కోట్లతో ప్రభుత్వమే పంటల బీమా చేయించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ భారమంతా ప్రజలపై వేసిందన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరిట మోసం చేయడం తప్ప చంద్రబాబు ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. దీపం పథకానికి బడ్జెట్‌లో రూ.740 కోట్లు పెట్టి ఎగ్గొట్టారన్నారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జడ్డు హరిబాబు ఉన్నారు.