
భవన నిర్మాణ కార్మికుల పోస్టుకార్డు ఉద్యమం
తాడేపల్లిగూడెం (టీఓసీ): భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లైయింలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న పోస్టు కార్డు ఉద్యమంలో పట్టణ పెయింటర్లు పాల్గొన్నారు. సోమవారం యాగర్లపల్లి వద్ద, గాయత్రి దేవి గుడి కల్యాణ మండపం వద్ద పెయింటర్ల నెలవారీ సమావేశాలు జరిగాయి. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు కోసం పోరాడాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లైయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని, వెల్ఫేర్ బోర్డులో నూతన సభ్యులను నమోదు చేసి కార్డులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాసి పోస్టు చేశామని వివరించారు. నాయకులు నానిపల్లి రాంబాబు, బెవర నారాయణ, బసవ సామేలు, కర్రి గోవిందు తదితరులు పాల్గొన్నారు.
ఉండిలో..
ఉండి: సంక్షేమ బోర్డును వెంటనే అమలులోకి తేవా లంటూ మండల భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు. ఉండి పార్క్‌లో నిర్వహించిన మండల భవన నిర్మాణ కార్మికులు సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ గళం వినిపించేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని పారంభించారు. సంఘ అధ్యక్షుడు శేషాద్రి శ్రీను మాట్లాడుతూ బోర్డును పునఃప్రారంభిస్తామని చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించి కార్మికులకు చేయూత అందించాలన్నారు. కార్యక్రమంలో గుండుగొలను ఆదాము, ఆడపా గణేష్, ఏడిద సతీష్ తదితరులు పాల్గొన్నారు.