
సోషలిజమే ప్రత్యామ్నాయం
భీమవరం: అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలమైందని దేశానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టంచేశారు. సోమవారం భీమవరంలో సోషలిజం–విశిష్టత అనే అంశంపై జిల్లాస్థాయి సెమినార్‌లో ఆయన మాట్లాడారు. సోషలిజానికి అనేక దేశాల్లో ఆదరణ కూడాపెరుగుతుందన్నారు. ప్రతి మనిషికి సమాన హక్కులు ఇచ్చేది, తిండి, ఇల్లు, విద్య, వైద్యం హక్కుగా మార్చి, సమాన వేతనం, అన్ని రకాల అసమానతలను, అమానుషమైన కులవ్యవస్థ వంటి వాటిని రద్దు చేసి సమానత్వాన్ని చూపించేదే సోషలిజమన్నారు. దేశంలో కులవ్యవస్థ శ్రమదోపిడికి మరింత దోహదం చేస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంలో సీ్త్ర, పురుష సమానత్వం ఉంటుందో అక్కడ ఉత్పత్తితో పాటు అభివృద్ధి కూడా పెరుగుతుందన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని అమెరికా సుంకాల ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమ, పోరాటాలు మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సెమినార్‌కు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరామ్, కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు