
ఆక్వాకు వాతావరణ గండం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రైతులు విలవిల
కై కలూరు: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఉమ్మడి జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ ప్రభావం చేపల, రొయ్యల పరిశ్రమపై పడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చి వర్షాలు కురుస్తుండంతో ఆక్వా రైతులు సంతోషించారు. ఇది ఎంతో కాలం నిలవలేదు. జూలై నెలలో ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆక్వా సాగుకు దినదిన గండంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఆక్వాసాగు విస్తీర్ణం 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇందులో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఆకివీడు, నరసాపురం నియోజకవర్గాల్లో ఆక్వా సాగు ఎక్కువుగా చేస్తున్నారు. రొయ్యల, చేపల పెరుగుదల 28, 30 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర బాగుంటుంది. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుతున్నాయి. బుధవారం కై కలూరులో 36 డిగ్రీలు, భీమవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటిలో ప్రాణవాయువు కరిగే శక్తి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో నీటి లెవల్స్ 3 అంతస్తులుగా వేరుపడతాయి. దీనివల్ల చెరువు పైపొరల్లో డీవో ఎక్కువగా, అడుగు పొరల్లో డీవో తక్కువుగా వుంటూ చేపలు, రొయ్యలకు ఇబ్బంది కలిగిస్తుంది. చెరువు నీటిలో అవసరమైన, హానికరమైన శైవలాలు కూడా ఏర్పడతాయి. నీటి పీహెచ్ పెరిగిపోతుంది. నీటి ఉష్ణోగ్రత పీహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమ్మోనియా స్థాయి పెరిగి రొయ్యలు, చేపలకు ఒత్తిడి కలిగించి వ్యాధులకు దారితీస్తుంది. ఎక్కువగా చిరు చేపలు, రొయ్యలు అధిక నీటి గుణాల తారతమ్యాలను తట్టుకోలేవు.